పేపర్ లీకేజ్ ఇష్యూకి సంబంధించి పోరును మరింత ఉద్ధృతం చేస్తోంది కాంగ్రెస్. ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ.. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిరుద్యోగ నిరసన దీక్షకు దిగారు. జువ్వాడి గేట్ నుంచి గాంధారి శివాజీ చౌక్ వరకు పాదయాత్ర చేసిన అనంతరం.. రేవంత్ దీక్షకు కూర్చున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష చేయనున్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ చేయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్ దీక్షకు పూనుకున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలకు, దిష్టిబొమ్మల దగ్ధానికి రేవంత్ రెడ్డి పిలుపునివ్వడంతో రోడ్డెక్కారు నేతలు.
మరోవైపు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వర్గపోరు బయటపడింది. గాంధారి మండల కేంద్రంలో రేవంత్ ఎదుటే సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ రావు వర్గాలు తన్నుకున్నాయి. బహిరంగంగానే వార్ కు దిగాయి. కాంగ్రెస్ నేతలను సముదాయించే ప్రయత్నం చేశారు రేవంత్. కానీ, ఇరు వర్గాలు వినిపించుకోలేదు.
పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న రేవంత్.. సుభాష్ రెడ్డి వర్గానికే అనుకూలంగా ఉన్నారని మదన్ మోహన్ రావు వర్గీయులు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో నిరసన దీక్ష స్టేజ్ మీదకు మదన్ మోహన్ ఒక్కడినే అనుమతించాలని సెక్యూరిటీకి సూచించడంతో ఈ వివాదం మొదలైనట్లు ప్రచారం సాగుతోంది.