భారత్ బంద్ సందర్భంగా సీఎం కేసీఆర్, ప్రధాని మోడీపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. రైతుల కోసం రోడ్డు మీద బంద్ లో ఉండాల్సిన సీఎం కేసీఆర్… ఢిల్లీకి పోయి మోడీ పార్టీలు ఇచ్చే విందులో పాల్గొన్నాడని విమర్శించారు. మొన్ననే సమస్యలున్నాయని ఢిల్లీకి పోయిండు, మరి ఇప్పుడు ఎందుకు ఢిల్లీ పోయిండని ఆయన ప్రశ్నించారు.
మోడీ-కేసీఆర్ ఒక్కటేనని… గతంలో కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా కేటీఆర్ కూడా బంద్ లో పాల్గొన్నారని, కానీ వారం తిరిగే సరికి ఢిల్లీ వెళ్లి కేసీఆర్ మోడీతో సమావేశం అయ్యారని రేవంత్ విమర్శించారు. ఆ తర్వాత కేసీఆర్ యూ టర్న్ తీసుకున్నారన్నారు. ఈ దేశ సంపదను అంబానీ, అదానీలకు అప్పజెప్పేందుకే ఈ నల్ల చట్టాలు తెచ్చారని, ఈ చట్టాలతో రైతులను బానిసలుగా మార్చే కుట్ర ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కరోనా సమయంలో ప్రైవేటు ఆసుపత్రులు పేదల రక్తం తాగుతున్నా కేసీఆర్ పట్టించుకోలేదని, చనిపోతే దహన సంస్కారాలు కూడా చేయలేక మార్చురీల్లో రోజుల తరబడి ఉంచేలా చేశారని కేసీఆర్ పై రేవంత్ మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్… తెలంగాణలో 60లక్షల మంది యువత ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ప్రభుత్వ వెబ్ సైట్ లో ఉద్యోగం కోసం 26లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారన్నారు.
యువతకు ఉద్యోగం కావాలంటే ఊరూరా ప్రతి చౌరస్తా, మందిరాల వద్ద కేసీఆర్ ప్లెక్సీ పెట్టి మందుపోయాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఇంతకన్నా నిరసన తెలిపే మరో మార్గం మనకు లేదని పిలుపునిచ్చారు. అలా అయితే కేసీఆర్ మనస్సు కరిగేలా లేదన్నారు. లేదంటే సీసాలను కొరియర్ చేయాలన్నారు.
Advertisements
ఉప్పల్ లో భారత్ బంద్ లో పాల్గొన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీపీఎం నేత తమ్మినేని సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.