– పార్టీ ఫిరాయింపులు కేసీఆర్ కనిపెట్టిన ఫార్ములానే..
– ప్రెస్ మీట్ లో సీఎం మాటలు హాస్యాస్పందం
– షిండేలను తయారుచేసిందే ఆయన
– కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ ఆగ్రహం
– ఆగస్టు 2న సిరిసిల్లలో భారీ బహిరంగ సభ
– పెద్ద ఎత్తున యువత తరలి రావాలని రేవంత్ పిలుపు
కేసీఆర్ మంత్రివర్గం మొత్తం ఏక్ నాథ్ షిండేలేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో షిండేలను ఉత్పత్తి చేసింది కేసీఆరేనని అన్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కంకణం కట్టుకున్నట్టుగా సీఎం మాట్లాడడం హాస్యాస్పందంగా ఉందన్నారు. ప్రెస్ మీట్ లో సీఎం ఏకపాత్రాభినయం చేశారని విమర్శించారు. కేసీఆర్ సృష్టించిన భూతం ఆయననే వెంటాడుతుందన్నారు. తొలుత టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ ను తీసుకొని మంత్రిగా ప్రమాణం చేయించి తెలంగాణలో షిండేను పుట్టించిందే కేసీఆర్ అని సెటైర్లు వేశారు. అంతటితో ఆగకుండా ఎర్రబెల్లి, సబితతోపాటు పలువురిని టీఆర్ఎస్ లో చేర్చుకోలేదా అంటూ ఫైరయ్యారు.
మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలో ఆగస్టు 2న భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు. నిరుద్యోగ సమస్యలపై సిరిసిల్ల డిక్లరేషన్ పేరుతో విద్యార్థి డిక్లరేషన్ చేస్తున్నట్లు చెప్పారు. సిరిసిల్ల సభకు భారీఎత్తున యువత తరలి రావాలని సూచించారు. కేసీఆర్ ను వదిలించుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. రాజపక్సే కుటుంబానికి పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి పడుతుందని జోస్యం చెప్పారు. శ్రీలంక పరిణామాలతో కేసీఆర్ భయపడుతున్నారని ఆరోపించారు.
సహారా కుంభకోణంలో కేసీఆర్ ను బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు. కేసీఆర్ అవినీతిపై విచారణకు మోడీ ఆదేశిస్తారని ఆశిద్దామని ఆకాంక్షించారు. కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను యథేచ్ఛగా ప్రోత్సహించారని గుర్తు చేశారు. తన పేరు ఉచ్ఛరించడానికి కూడా కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు రేవంత్. నాలుగు రోజుల్లో మంత్రివర్గాన్ని రద్దు చేసి కేసీఆర్ ముందస్తుకు రావాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందని.. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని ఆపార్టీ వ్యూహకర్త స్పష్టమైన నివేదిక ఇచ్చినట్టు పేర్కొన్నారు. టీఆర్ఎస్ 32 సీట్లు గెలిచేలా ఉందని… మరో 17 సీట్లు పోటాపోటీ ఉందని.. కాంగ్రెస్ 32సీట్లు గెలుస్తుందని మరో 23 సీట్లలో గట్టి పోటీ ఇస్తుందని నివేదికలో తేలిందని వివరించారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు పెట్టుబడి సమకూర్చింది కేసీఆర్ తో పాటు ఆయనకు సంబంధించిన పెట్టుబడిదారులు కాదా అని ప్రశ్నించారు రేవంత్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మోడీ కేసీఆర్ పై ఒక్క విమర్శ కూడా చేయలేదని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా చేసుకోవద్దని ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు. 2004లో కడప, నంద్యాలలోనూ టీఆర్ఎస్ కారు గుర్తుపై పోటీ చేసిందని గుర్తు చేశారు. అనాడే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని కేసీఆర్ నిబంధనలను ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎంపీలను బీజేపీలోకి పంపితే తెలంగాణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి అవుతుంది కదా అని నిలదీశారు.