సీఎం కేసీఆర్ పోడు భూముల పట్టాలపై వ్యవహరిస్తున్నతీరుపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నేను కుర్చీ వేసుకొని కట్టిస్తానన్న కేసీఆర్ తాగి ఫాంహౌజ్ లో పడుకున్నారన్నారు. అక్టోబర్ 5న అశ్వర్రావుపేట నుండి అదిలాబాద్ వరకు 400కి.మీ రోడ్డును దిగ్భందిస్తామని హెచ్చరించారు. తానే స్వయంగా వచ్చి భద్రాద్రిలో బంద్ లో పాల్గొంటానని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఈ నెల 27న భారత్ బంద్ కు దేశవ్యాప్తంగా 20పార్టీలు పిలుపునిచ్చాయని, అంతా సహకరించాలని కోరారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచేసి ప్రజలను దోచుకుంటున్నాయని విమర్శించారు. ఎక్కడికక్కడ అఖిలపక్ష నేతలంతా బంద్ ను విజయవంతం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 30న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చొరవ తీసుకొని అన్ని పార్టీలను కలుపుకొని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై అంబేద్కర్ విగ్రహాలకు, కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు.
రైల్వే స్టేషన్ లో చాయ్ అమ్మి ప్రధాని అయిన అని చెప్పుకునే మోడీ… ఇప్పుడు ఏకంగా రైల్వేలనే అమ్మేస్తున్నాడని రేవంత్ విమర్శించారు. కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతున్నారని, ఇప్పుడు వీరు అమ్మేవన్నీ కాంగ్రెస్ చేసిన అభివృద్దే అని మండిపడ్డారు. మోడీ-షాలు కలిసి అంబానీ, అదానీలకు దేశాన్ని అమ్మేస్తున్నారని, గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకం కోసం దేశాన్ని ఏలిన సందర్భాలను రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
శివలింగంపై తేలుంటే ఎవరూ కొట్టరేమో అన్నట్లుగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమంపై ఉన్న తనను ఎవరూ ఏమీ చేయలేరని అనుకుంటున్నారని, శివలింగం మీదున్న తేలును కిందకు తెచ్చి ఎలా తొక్కేయాలో తమకు తెలుసన్నారు. తెలంగాణ ఉద్యమం పేరుతో ఉన్న కేసీఆర్ ను తొక్కేసే అనుభవం అఖిలపక్ష నేతలకుందన్నారు.