ప్రశ్నించే గొంతుకగా నిలబడుతున్న జర్నలిస్టు తీన్మార్ మల్లన్నకు మద్ధతుగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రంగంలోకి దిగబోతున్నట్లుగా తెలుస్తోంది. కేసుల పేరుతో ప్రభుత్వం వేధిస్తూ మల్లన్న గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన ప్రాణాలకు హానీ తలపెట్టినా ఆశ్చర్యం లేదని మల్లన్న కుటుంబ సభ్యులు రేవంత్ రెడ్డితో తమ బాధను పంచుకున్నారు.
మల్లన్న విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న రేవంత్ రెడ్డి… మల్లన్నకు ఓవైపు న్యాయ సహయం అందిస్తూనే మరోవైపు ప్రభుత్వంపై పోరాడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రశ్నించే గొంతులను నొక్కివేసే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారని, ప్రజల కోసం నిలబడే వారిని కాపాడుకోవటం ప్రతిపక్ష పార్టీగా తమ బాధ్యత అని ఇది వరకే రేవంత్ రెడ్డి ప్రకటించారు. మల్లన్నపై రాష్ట్రవ్యాప్తంగా మరో 8 కేసులు పెట్టబోతున్నారని, వరుసగా పీటీ వారెంట్ లు ఇస్తూ ఎక్కువ కాలం మల్లన్నను జైల్లో ఉంచే కుట్ర సాగుతుందని సమాచారం రావటంతోనే రేవంత్ రెడ్డి ఈ ఇష్యూలో ఎంటర్ అయినట్లు సమాచారం.
ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న తీన్మార్ మల్లన్నను బయటకు తెచ్చేందుకు హైకోర్టు లాయర్లను ఏర్పాటు చేయటంతో పాటు మల్లన్న కుటుంబ సభ్యులకు అండగా ఉంటున్నారు. ప్రభుత్వం ఇదే నిర్బంధంతో వ్యవహరిస్తే ప్రత్యక్ష పోరాటాలకు కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో జర్నలిస్టు రఘు విషయంలో ప్రభుత్వం ఇదే ధోరణితో వ్యవహరించగా, ఇప్పుడు మల్లన్న విషయంలోనూ ఫేక్ కేసులు తెరపైకి తెచ్చి జైల్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. కేసీఆర్ ఆగడాలు ఇక సాగవని, కేసీఆర్ పై పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.