ఇటీవలి కాలంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ వచ్చింది.. గొడవలెందుకు.. మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పారు. ఓవైపు బీజేపీతో కుమ్మక్కు అయి.. కేసీఆర్ కాంగ్రెస్ ను ఎదగనివ్వకుండా చేస్తున్నారని రేవంత్ విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో అనేక అనుమానాలు తెరపైకొచ్చాయి.
రేవంత్ తో కోమటిరెడ్డి మళ్లీ చెడిందా? అనే చర్చ జరిగింది. అయితే.. అలాంటిదేం లేదని స్పష్టం చేస్తూ కోమటిరెడ్డి ఇంటికి వెళ్లారు రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. దానికి హ్యాపీ టైమ్స్ అని క్యాప్షన్ ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు స్పందిస్తున్నారు. ఇలాగే కలిసి ముందుకెళ్దాం.. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొద్దామని కామెంట్స్ పెడుతున్నారు.
నిజానికి రేవంత్ ను టీపీసీసీ చీఫ్ గా నియమించడాన్ని కోమటిరెడ్డి వ్యతిరేకించారు. ఏకంగా అధిష్టానంపైనే విమర్శలు చేశారు. కొన్నాళ్లు కస్సుబుస్సులాడారు. చివరకు రైతుల సమస్యలపై ఇందిరాపార్క్ లో జరిగిన రెండు రోజుల దీక్షలో మొదటిసారిగా రేవంత్ ను కలిశారు. ఒకే వేదికపై రెండు రోజులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దీంతో పార్టీ క్యాడర్ లో మరింత ఉత్సాహం పెరిగింది. పార్లమెంట్ సమావేశాల సమయంలోనూ ఒకే ఫ్రేమ్ లో పక్కపక్కనే నిలబడి ప్రెస్ మీట్లు, నిరసనలు కొనసాగించారు. అయితే.. జనగామలో కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్, కోమటిరెడ్డి అత్మీయంగా ఒకరినొకరు పలకరించుకంటూ సరదా గడిపారు. అలింగనం చేసుకుని కలిసిపోయారు. తర్వాత కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు కోమటిరెడ్డి. ఇది కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలను అశ్చర్యానికి గురి చేసింది.
తెలంగాణ ప్రభుత్వాన్ని పొగుడుతూ కోమటిరెడ్డి మాట్లాడడం పార్టీలో చర్చకు దారి తీసింది. కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు నేతలు పార్టీకి ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్.. కోమటిరెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనతో పాటు అద్దంకి దయాకర్ సహా పలువురు ఉన్నారు.