పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంపికవ్వగానే కాంగ్రెస్ లో కొత్త ఉత్తేజం కనపడుతుంది. వరుసగా పర్యటనలు చేస్తూ, జనం సమస్యలపై రియాక్ట్ అవుతున్నారు. కీలకమైన దళితులు, గిరిజనుల సమస్యలపై దళిత గిరిజిన దండోరా సభలు నిర్వహిస్తున్నారు. మొదట్లో రేవంత్ నాయకత్వంపై సీనియర్ల నుండి కొంత వ్యతిరేకత వ్యక్తం అయినా క్రమంగా అన్ని సర్ధుకున్నాయి.
గజ్వేల్ లో సెప్టెంబర్ 17తో దళిత గిరిజన దండోరా సభ ముగుస్తుంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి దేనిపై ఫోకస్ చేయబోతున్నారు…? అన్న చర్చ స్టార్ట్ అయ్యింది. నిజానికి యూత్ లో రేవంత్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయన ఉద్యోగాల భర్తీపై ప్రశ్నిస్తారు, పోరాడుతారు అని అంతా అనుకున్నారు. కానీ దళిత గిరిజన సమస్యలపై ఫోకస్ చేశారు. ఇక ఇప్పుడు నిరుద్యోగ అంశం ఎజెండాతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఉన్న 2లక్షల ఉద్యోగాల భర్తీ, కేసీఆర్ అతి త్వరలో అంటూ గత ఏడాది డిసెంబర్ లో చెప్పిన 50వేల ఉద్యోగాల భర్తీ అంశాలే ప్రధాన ఎజెండాగా ఆయన ముందుకు సాగబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఏర్పాటు చేసే సభల్లో ఒక సభ సిరిసిల్లలోనూ ఉండే అవకాశం కనపడుతుంది. సిరిసిల్ల, నిజామాబాద్, పాలమూరు, వికారాబాద్ లో సభలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టి అవసరం అయితే దీక్షకు కూర్చునే ఆలోచనలో కూడా రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.