– కమీషన్ల కోసమే ఢిల్లీలో కేసీఆర్ మకాం
– ప్రధానిని ప్రశ్నించడానికి ఎందుకంత భయం
– వెంటనే కార్యాచరణ ప్రకటించాలి
– ఆ తర్వాతే ఢిల్లీ నుంచి కదలాలి
– ఎప్పుడూ ఒకరినొకరు కాపాడే రాజకీయాలేనా?
– మోడీ, కేసీఆర్ పై రేవంత్ ఫైర్
కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రధానిని ప్రశ్నించడానికి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ఎంపీలు మిగతా పక్షాల వెనుక దాక్కుని పోరాటం అని కలరింగ్ ఇస్తున్నారని మండిపడ్డారు. ఫోటోలకు ఫోజులివ్వడం తప్ప వాళ్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆరోపించారు. మోడీ, కేసీఆర్ తెలంగాణను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర సమస్యలపై ప్రధానిని కలుద్దాం అంటే తమకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని.. కేసీఆర్ పోరాట కార్యాచరణను ప్రకటించాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఢిల్లీ నుంచి కదలాలన్నారు.
తెలంగాణలో వరదల వల్ల భారీ నష్టం వాటిల్లితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు రేవంత్. ఢిల్లీలో సునామీ సృష్టిస్తానన్న కేసీఆర్ తన ఇంటి నుంచి బయటకు రావడం లేదని చురకలంటించారు. మోడీ, కేసీఆర్ ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వివిధ బ్యాంకులలో రావాల్సిన లోన్లపై అధికారులతో కేసీఆర్ చర్చిస్తున్నారని.. అవి వచ్చాక కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి కమీషన్లు తీసుకోవాలనే ప్లాన్ లో ఉన్నారని విమర్శించారు. కేసీఆర్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరారు.
మోడీ గుజరాత్ కే ప్రధాని నా.. అక్కడ వరదలు వస్తే వేల కోట్లు ఇస్తారు.. తెలంగాణను ఎందుకు ఇవ్వరని నిలదీశారు టీపీసీసీ చీఫ్. కిషన్ రెడ్డి, ఇతర ఎంపీలు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోయారని విమర్శించారు. ప్రకృతి వైపరిత్యాల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకోవాలని గుర్తు చేశారు. నష్టంపై నివేదికలు తయారు చేయాలని, కేసీఆర్ స్వార్ధంతో ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని విమర్శలు చేశారు. వరదల వల్ల రాష్ట్రంలో 3 వేల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు తమకు సమాచారం ఉందన్నారు.
కిషన్ రెడ్డి రాష్ట్ర పరిస్థితిని ప్రధానికి వివరించి నిధులను తీసుకురావాలని సూచించారు. కేసీఆర్ చేస్తున్న అక్రమాలపైనా విచారణ చేయించాలన్నారు. ఇక కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై పార్టీ అంతర్గతంగా చర్చిస్తుందని స్పష్టం చేశారు రేవంత్. దీనిపై హై కమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.