తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని విమర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. చంచల్ గూడ జైలులో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ సహా మిగిలిన 17 మంది విద్యార్థులను రాహుల్ గాంధీ కలిసేందుకు అనుమతి కోరుతూ.. జైళ్ల శాఖ డీజీ జితేందర్ రెడ్డిని కలిశారు. వినతిపత్రం సమర్పించారు. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు రేవంత్.
ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ రావడానికి వీసీని కలసి వినతిపత్రం ఇచ్చామన్నారు. విద్యార్థుల పిలుపు మేరకే ఆయన వస్తానన్నారని చెప్పారు. అయినా కూడా అనుమతి ఇవ్వలేదని.. చాలా కేసులు నమోదు చేసి విద్యార్థులను జైలుకు పంపించారని అన్నారు. అందుకే వారిని కలిసేందుకు రాహుల్ కు అనుమతి ఇవ్వాలని కోరేందుకు డీజీని కలిసినట్లు వివరించారు.
మే 7న రాహుల్ చంచల్ గూడ జైలుకు వస్తారని అన్నారు రేవంత్. జైలు సూపరింటెండెంట్ అనుమతి కోసం దరఖాస్తు కూడా పెట్టుకున్నామని చెప్పారు. డీజీని కలవాలని చెప్పడంతో వెళ్లి కలిశామని.. ఆయన ఆలోచించి నిర్ణయం చెబుతామన్నారని వివరించారు. ఎలాంటి ఖైదీలనైనా కలిసే హక్కు ఎవరికైనా ఉంటుందని అన్నారు. ప్రజా ప్రతినిధులు జైల్లో ఉన్న విద్యార్థులను కలవడానికి అనుమతి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
రాష్ట్రంలో నాయకులు, అధికారులపై తీసుకొస్తున్నారని.. అధికారం శాశ్వతం కాదని కేసీఆర్ ను హెచ్చరించారు. ఇది నిరంకుశ పాలనలా అనిపిస్తోందని.. ప్రజాస్వామ్య బద్దంగా తాము అనుమతి కోరినట్లు గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న రేవంత్.. రాహుల్ గాంధీ ఓయూ టూర్ కి పర్మిషన్ ఇవ్వాలని మీడియాముఖంగా కోరారు. రేవంత్ రెడ్డి వెంట జగ్గారెడ్డి, గీతా రెడ్డి, మధుయాష్కీ గౌడ్, సంపత్ కుమార్, మానవతారాయ్ సహా పలువురు ఉన్నారు.