తెలంగాణ విద్యావ్యవస్థ నిర్లక్ష్యానికి గురవుతోందనే విమర్శలు ఉన్నాయి. కేసీఆర్ సర్కార్ మన ఊరు-మన బడి అంటూ డబ్బా కొట్టుకోవడమే గాని.. వాస్తవంగా జరుగుతోంది వేరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏకంగా ఉపాధ్యాయ సంఘాలే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది.
రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్
‘‘తెలంగాణలో పేద పిల్లల చదువులకు ‘చంద్ర’గ్రహణం పట్టింది. ఉపాధ్యాయులు లేక, పాఠ్యపుస్తకాలు లేక పాఠశాలలు వెలవెలబోతున్నాయి. ‘మన ఊరు – మన బడి’ ఓ ప్రచారార్భాటం. ప్రశ్నించకపోతే తెలంగాణ అజ్ఞానాంధకారంలోకి వెళ్లడం ఖాయం’’
ఈ ట్వీట్ కు కేసీఆర్ ఫెయిల్డ్ తెలంగాణ, బైబై కేసీఆర్ అనే హ్యాష్ ట్యాగ్స్ జత చేశారు రేవంత్. అంతేకాదు ఓ టీచర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ వీడియోను పోస్ట్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు అయిందని.. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో చేసిన పోరాటాలను, ఉద్యమాలను మరిచి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు టీచర్లు. ప్రస్తుతం రాష్ట్రంలో పోరాడితే వణికే పరిస్థితి నెలకొందని.. అధికార దాహంతో ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ నేతలు నిరంకుశ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. తామేమన్నా ఫాంహౌస్ లో భాగమడుగుతున్నామా? పుస్తకాలు కావాలి.. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని అడుగుతున్నామన్నారు. కేసీఆర్ చెప్పిన పగల్భాల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.