గజ్వేల్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన దండోరా సభ జరపనుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే, ఈ సభకు జనం రాకుండా టీఆర్ఎస్ కూడా ఎత్తులు వేస్తుంది. గజ్వేల్ లోనే కాంగ్రెస్ సభ సూపర్ సక్సెస్ అయితే ఆ ప్రభావం రాష్ట్రం అంతా ఉంటుందని, రేవంత్ రెడ్డి సభను ఎలాగైనా ఫెయిల్ చేయాలన్న ఆలోచనలో టీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ శ్రేణులు రెండ్రోజులుగా ఆరోపిస్తున్నాయి.
కొన్ని రోజులుగా టీఆర్ఎస్ సర్పంచ్ లను, స్థానిక నేతలను, డీలర్లను, స్థానికంగా ఉన్న ఆర్ఎంపీలను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. సెప్టెంబర్ 17నే ప్రతి గ్రామంలో కనీసం 500మందికి భోజనాలు పెట్టాలని, ఊరూరా టీఆర్ఎస్ మీటింగులు పెట్టుకోవాలని ఆదేశాలు వెళ్లాయి. అదే రోజు మంత్రి హరీష్ రావు కూడా గజ్వేల్ లో పర్యటిస్తున్నారు. ఇవన్నీ రేవంత్ సభకు జనం రాకుండా చేస్తున్న ప్రయత్నాలే అని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.
అయితే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ప్రతి బూతు నుండి కనీసం 7గురు అయినా సభకు తరలి రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నారు. గజ్వేల్ గడ్డపై గర్జించేందుకు కాంగ్రెస్ శ్రేణులు తరలి రావాలని కోరారు. అయితే, కాంగ్రెస్ లక్ష మందితో సభ పెట్టాలని నిర్ణయించింది. జనం రాకుండా టీఆర్ఎస్ కుట్రలు చేస్తుండటంతో రేవంత్ రెడ్డి తనదైన శైలీలో వ్యూహా రచన చేశారని, అందుకే ప్రతి బూతు నుండి కనీసం 7గురు అన్న పిలుపు ఇచ్చినట్లు ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ప్రతి బూత్ నుండి 7గురు అంటే 3,12,372మంది అవుతారు. అందులో కనీసం 33శాతం మంది సభకు వచ్చినా లక్షా నాలుగు వేల మంది అవుతారు. అంటే రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించినట్లే.