– వరదలతో జనం అల్లాడుతున్నారు
– 11 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి
– నష్టం అంచనాలో రాష్ట్ర సర్కార్ ఫెయిల్
– జాతీయ విపత్తుగా పరిగణించాలి
– మోడీని కోరిన రేవంత్
తెలంగాణలో కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎటు చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది. జనజీవనం స్తంభించిపోయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తూ.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. వరదలతో జనం అల్లాడుతుంటే.. అబద్దాల్లో పుట్టి..అబద్దాల్లో పెరిగి..అబద్దాలనే నమ్ముకొని బతుకుతున్న కేసీఆర్, కేటీఆర్ మాత్రం.. అబద్దాలే చెబుతూ ప్రజలను, రైతులను మభ్య పెట్టే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. 100 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో కుంభవృష్టి కురిసి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో పత్తి, సోయాబిన్, పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, వరి పంటలు పూర్తిగా నీట మునిగి సర్వనాశనమైతే.. ఎకరం కూడా పంట నష్టం జరగలేదని ట్విటర్ పిట్ట కారు కూతలు కూస్తోందని ఫైరయ్యారు. భారీ వర్షాలు పడినా.. రాష్ట్రంలో పెద్దగా పంట నష్టం జరిగినట్లు సమాచారం లేదని, కొందరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించడం అవివేకమన్నారు.
కేటీఆర్ కు సవాలు విసురుతున్నట్లు చెప్పారు రేవంత్. ఇద్దరం కలిసి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వరద ప్రాంతాల్లో పర్యటిద్దామన్నారు. ఎకరం పంట కూడా మునగకపోతే..తాను ముక్కు నేలకు రాస్తానని.. పంట నష్టం జరిగిందని నిరూపిస్తే కేటీఆర్ ముక్కు నేలకు రాసి తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలని ఛాలెంజ్ చేశారు. కళ్ల ముందు ఇంత ఘోరం కనిపిస్తుంటే కడుపుక అన్నం తినేవాడు ఏవడైనా పంట నష్టం జరగలేదని మాట్లాడతాడా?.. రాష్ట్రంలో రైతులను, వ్యవసాయాన్ని గాలికి వదిలేశారని ఫైరయ్యారు. ప్రకృతి కరుణించి, రైతులు కష్టంచి పంట పండిస్తే అది తమ క్రెడిట్ అని అయ్యా కొడుకులు తమ ఖాతాలో వేసుకుంటారని ఆరోపించారు. అదే ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగినా, మద్దతు ధర రాకపోయినా..రైతుల ఖర్మ అని వదిలేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘కమీషన్లు వస్తాయి కాబట్టి లక్ష కోట్లతో ప్రాజెక్టులు కడతారు. కానీ వాటి నిర్వహణకు నయా పైసా విడుదల చేయరు. కాంట్రాక్టర్లకు, రీడైజన్లకు కమీషన్ ఇచ్చే వారికి ప్రగతి భవన్ గేట్లు తెరుచుకుంటాయి గానీ, ప్రాజెక్టుల నిర్వహణకు మాత్రం నిధులు విడుదల చేయరు. దీన్ని బట్టి మీకున్న ధన దాహం, అధికార దాహం అర్థమవుతోంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.1.52 లక్షల కోట్లు వెచ్చించాం.. తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం చేసిన ప్రకటన ఇది. కానీ, ఇలా కట్టుకున్న ప్రాజెక్టులను, ఇదివరకే కట్టిన ప్రాజెక్టులను కాపాడుకునే బాధ్యతను ప్రభుత్వం గాలికొదిలేసింది. తాజాగా గోదావరి పరీవాహకంలోని కడెం ప్రాజెక్టుకు 5 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో ఓ దశలో కొట్టుకుపోతుందేమో?అనే భయం వెంటాడింది. కానీ, అదృష్టం బాగుండి గండం గట్టెక్కింది. ఇదే కాదు.. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నింటి పరిస్థితి కొంచెం అటుఇటుగానే ఇలానే ఉంది. నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఈఎన్‌సీ (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) నేతృత్వంలో విభాగాన్ని ఏర్పాటు చేసినా… నిధులు ఇవ్వకపోవడం, అధికారాలు పరిమితంగా ఉండడంతో ఆ ఉద్దేశం నీరుగారుతోంది. ఈ విభాగం కింద పనులు చేపట్టాలంటే చాలు కాంట్రాక్టర్లు ఆమడదూరం పారిపోతున్నారు’’ అని అన్నారు రేవంత్ రెడ్డి.
ఓ ప్రాజెక్టు గేట్లకు ఏటా రూ.20వేలతో గ్రీజింగ్ చేయాలని… నిధులు లేక పనులు చేయకపోవడంతో ఆ గేట్లకు ప్రస్తుతం రూ.3కోట్ల దాకా వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. కాళేశ్వరంలోని రెండు కీలక పంప్ హౌజ్ లు లక్ష్మి (మేడిగడ్డ) పంప్ హౌజ్, సరస్వతి (అన్నారం) నీట మునిగాయని చెప్పారు. లక్ష్మి పంప్ హౌజ్ లో 17 మోటార్లు/ పంపులు, సరస్వతి పంప్ హౌజ్ లో 12 మోటార్లు పూర్తిగా నీట మునిగాయని వివరించారు. మోటార్లతోపాటు ప్యానెల్ బోర్డులు, కంప్యూటర్లు, ఇన్వర్టర్లు, విద్యుత్తు సామాగ్రి పూర్తిగా దెబ్బతిందని.. ప్రాథమిక అంచనా మేరకు, రూ.500 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారన్నారు. దీన్ని పునరుద్ధించాలంటే నాలుగేళ్లు పడుతుందని అంటున్నారని చెప్పారు.
‘‘ఈ ప్రాజెక్టు మునగడం వెనుక టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి కూడా ఉంది. కేసీఆరే ఓ ఇంజనీర్ గా దగ్గరుండి పనులు డిజైన్ చేశారు. ఆయన అనాలోచిత విధానాలు, అర్థపర్థం లేని డిజైన్లే ప్రస్తుత స్థితికి కారణం. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ వంటి లక్ష్మి పంపుహౌజ్ నుంచే నీటిని ఎత్తిపోస్తారు. దాంతో, భారీ వరదలు వస్తే తట్టుకునేలా రూపకల్పన ఎందుకు చేయలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 1986 ఆగస్టు 16న కాళేశ్వరం వద్ద అతి భారీగా 28.18 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినట్లుగా రికార్డులు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని పంపుహౌజ్ నిర్మాణాన్ని చేయలేదు. ఇది ఇంజనీరింగ్ వైఫల్యమే. రక్షణ గోడ కూలిపోవడం నాణ్యతా లోపాలను ఎత్తిచూపిస్తోంది. భారీ ప్రవాహాన్ని తట్టుకునేలా నిర్మించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి’’ అని విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో పంటల పరిస్థితి గాలిలో దీపంగా మారిందన్నారు రేవంత్. అన్నదాతలను కష్టకాలంలో ఆదుకోవాల్సిన పంటల బీమా పథకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో అందని ద్రాక్షలా మారుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో మూడేళ్లుగా వానాకాలం పంటల సాగు ప్రారంభంలోనే కుండపోత వర్షాలు కురుస్తుండటం.. పంట నష్టం జరిగినా ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎం-ఎ్‌ఫబీవై) పథకాన్ని తెలంగాణలో ఎత్తివేయడం, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బీమా పథకాన్ని అమలు చేయకపోవడంతో అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి విపత్తుల సమయంలో రైతులకు నష్టపరిహారం లభించడం లేదని వివరించారు. 2015-16 వరకు నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్(ఎన్‌ఏఐఎస్), మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్(ఎంఎన్‌ఏఐఎస్), వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్(డబ్ల్యూబీసీఐఎస్) లాంటి పథకాలు అమలులో ఉండేవని.. రాష్ట్రంలో సగటున 10 లక్షల మంది రైతులు పంటల బీమా చేసేవారని అన్నారు. ప్రకృతి విపత్తులు వచ్చి పంటలు నష్టపోయినప్పుడు రైతులకు ఎంతో కొంత పరిహారం అందేదని… కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు వరుసగా మూడేళ్లు అతివృష్టితో నష్టపోతున్నారన్న రేవంత్… ఈ సీజన్‌లోనూ అదే పరిస్థితి కనిపిస్తోందని చెప్పారు. వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని తెలిపారు.
‘‘ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, మెదక్, హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పంటలపై భారీ వర్షాల ప్రభావం పడింది. హనుమకొండ జిల్లాలో 77,163 ఎకరాల్లో వివిధ పంటలు వేయగా చాలావరకు నీట మునిగాయి. వరంగల్ జిల్లాలో పత్తి, మొక్కజొన్న, కంది, పెసర 90 శాతం మునిగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 13 వేల ఎకరాల్లో పత్తి, 24 వేల ఎకరాల్లో వరిది ఇదే దుస్థితి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పత్తి, కంది, మొక్కజొన్న, పెసర, మినుము, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో కాకర, బీర తోటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో 4.60 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. వీటిలో వేల ఎకరాల్లో నీట మునిగాయి. నిజామాబాద్ జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంటలకూ ఇదే పరిస్థితి ఎదురైంది. వరి, సోయాబీన్, మొక్కజొన్నకు కలిపి రూ.4 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. వర్షాలు తగ్గితే ఇంకా పూర్తి స్పష్టత రానుంది. కామారెడ్డి జిల్లాలో 4,500 ఎకరాల్లో పంటలు పాడయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 10 వేల ఎకరాల్లో పత్తి, 4 వేల ఎకరాల్లో సోయాబీన్, 3 వేల ఎకరాల్లో కంది పనికి రాకుండా మారాయి. ఈ జిల్లాల్లో 5.62 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా వేల ఎకరాల్లో నీట మునిగాయి. నిర్మల్ జిల్లాలో 12 వేల ఎకరాల్లోని పత్తి, మొక్కజొన్నలకు నష్టం వాటిల్లింది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నాయి. అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, హవేలీ ఘన్ పూర్, నర్సాపూర్, శివ్వంపేట, తూప్రాన్, కౌడిపల్లి మండలాల్లో ప్రధాన పంటలతో పాటు కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. కరీంనగర్ జిల్లాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు మునిగాయి. పెద్దపల్లి జిల్లాలో 4,246 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. వరి, మొక్కజొన్న నీటిలో నానుతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో 45 వేల ఎకరాల్లో పత్తి, 5 వేల ఎకరాల్లో కంది, వేయి ఎకరాల్లో ఇతర పంటలూ ఇదే స్థితిలో ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 7 వేల ఎకరాల్లో నాట్లు కొట్టుకుపోయాయి. మొక్కజొన్న, కంది, పెసర మునిగిపోయాయి. జగిత్యాల జిల్లాలో 17,500 ఎకరాల్లోని పత్తి, సోయాబీన్, మొక్కజొన్నలకు నష్టం వాటిల్లింది. మంచిర్యాల జిల్లాలో 14 మండలాల పరిధిలోని 286 గ్రామాల్లో 12 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. దీని విలువ రూ.3.50 కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా వేశారు. ఖమ్మం జిల్లాలో మాత్రమే పంట నష్టం స్వల్ఫంగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరదల కారణంగా 130 గ్రామాల్లో పంటలు మునిగాయి. జూలై నెల రెండో పక్షం, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. దీంతో పంట నష్టం పెరిగే ప్రమాదం ఉంది. రైతులకు మాత్రం పరిహారం అందే దిక్కు లేకుండా పోయింది. వరుసగా మూడేళ్లుగా పంటలు దెబ్బతింటున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదు’’ అని విమర్శించారు రేవంత్ రెడ్డి.
పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం ప్రగతి భవన్ కు మాత్రమే పరిమితమై తూతూ మంత్రపు సమీక్షలతో కాలక్షేపం చేస్తోందని ఫైరయ్యారు. ప్రజలకు నిత్యావసరాలు అందించే పరిస్థితి కూడా లేదని.. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఇంత వరకు వరద పరిస్థితిపై కనీసం ఆరా తీసిన పరిస్థితి లేదన్నారు. బీజేపీ ఎంపీలు సైతం వరదల సమస్యను కేంద్రం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో సంభవించిన ఈ నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న రేవంత్… రాష్ట్ర ప్రభుత్వాన్ని నష్టం అంచనాపై నివేదిక కోరాలని లేఖలో పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన పంటపై గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అంచనాలు, ఎన్యూమరేషన్ చేయడం లేదని వివరించారు.