ప్రధాని మోదీ కరోనా వ్యాక్సిన్ పేరుతో డ్రామా చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ రాకపోతే వ్యాక్సిన్ తయారు కాదా అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ నాయకుల ప్రవర్తన హైదరాబాద్ వాసులను అవమానపరిచేలా ఉందన్నారు.
వరదలు వచ్చినప్పుడు కేంద్ర హోంమంత్రిగా పరామర్శకు రాని అమిత్‌షా… మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఎలా వచ్చారని ఆయన ప్రశ్నించారు. యూపీ సీఎం యోగి ఆయన రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతుంటే ఏమీ చేయలేకపోయారన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతుందని బీజేపీ నేతలంటున్నారు కానీ అవినీతిపై కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. యూపీ సీఎం వచ్చి హైదరాబాద్ పేరు మారుస్తామంటారు… పేరు మార్చడానికి మీరెవరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి అంతా కాంగ్రెస్ హాయంలోనే జరిగిందన్నారు.
గ్రేటర్ ఎన్నికలతోనే టీఆర్ఎస్ పతనం మొదలైందని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే గ్రేటర్ ప్రజలు కాంగ్రెస్ కు ఓటేయ్యాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు.