చైనా సహా 5 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్ టెస్టులను కేంద్రం తప్పనిసరి చేసింది. చైనాతో బాటు హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయిలాండ్ దేశాల నుంచి ఇండియాకు వస్తున్న ప్రయాణికులు జనవరి 1 నుంచి విధిగా ఈ పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవీయ గురువారం వెల్లడించారు.
. ఈ దేశాల్లో కరోనా కేసులు అత్యధికంగా ఉన్నాయని, వీరు తమ ప్రయాణానికి ముందు తమ కోవిడ్ రిపోర్టులను ఎయిర్ సువిధ పోర్టల్ లో అప్ లోడ్ చేయవలసి ఉంటుందని ఆయన చెప్పారు. ఇండియాలో కరోనా కేసులను అదుపు చేసేందుకు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
గత రెండు రోజుల్లో వివిధ విమానాశ్రయాల్లో ప్రయాణికులకు 6 వేల ర్యాండమ్ టెస్టులు నిర్వహించగా.. 39 మంది అంతర్జాతీయ ప్రయాణికులు కోవిడ్ పాజిటివ్ కి గురైనట్టు వెల్లడైందని మాండవీయ పేర్కొన్నారు. ఇకపై విదేశాలనుంచి ఎవరు ఇండియాకు వచ్చినా నెగెటివ్ కోవిడ్-19 టెస్ట్ రిపోర్టు తప్పనిసరి అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.
జనవరిలో మన దేశంలో కరోనా కేసులు పెరగవచ్చునని.. అయితే హాస్పిటలైజేషన్లు, మరణాలు తక్కువే ఉండవచ్చునని అంచనా వేశాయి. గత 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 188 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏమైనప్పటికీ కరోనా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, కేంద్రం ప్రకటించిన ప్రొటొకాల్స్ ని , గైడ్ లైన్స్ ని ప్రజలు తప్పనిసరిగా పాటించాలని ఈ వర్గాలు మరోసారి సూచించాయి. అప్రమత్తత అవసరం అని పేర్కొన్నాయి.