తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రులు అనే తేడా లేకుండా.. గ్రామ స్థాయి ప్రజాప్రతినిధి నుండి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ప్రతీ ఒక్క టీఆర్ఎస్ నేతకు నిరసన సెగ వెంటాడుతుంది. ఇటీవల విద్యాశాఖ మంత్రి ఇంద్రారెడ్డి, మరో మంత్రి మల్లారెడ్డి ని అడ్డుకున్న విషయం మరువకముందే.. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఇదే నిరసన సెగ తగిలింది.
ఖమ్మం పర్యటనకు వెళ్లిన మంత్రిని పీడీఎస్యూ విద్యార్ధి సంఘ నాయకులు అడ్డుకున్నారు. మంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మంత్రి కాన్వాయ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన విద్యార్ధి సంఘ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. నిరసన కారులను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిరసన కారులను పోలీసు స్టేషన్ కు తరలించారు.
అధిక ఫీజులు పెంచి పేద విద్యార్ధులకు చదువును దూరం చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పీడీఎస్యూ నాయకులు. జిల్లాలో జనరల్ యూనివర్సిటీ తోపాటు.. పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని మెడికల్ కళాశాల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
ప్రతీ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నోటీఫికేషన్ లు విడుదైన నేపథ్యంలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లడానికి పేద కుంటుంబాలకు చెందిన విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని.. ప్రతీ మండలంలో కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. పెంచిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్ధులకు అందించే బిల్లులను పెంచాలని కోరారు.