రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది గరిష్టంగా 215,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ అవసరం ఉంటుందని చెప్పింది.
ఈ అవసరాలను తీర్చడానికి గాను థర్మల్ పవర్ స్టేషన్‌లలో బ్లెండింగ్ ప్రక్రియ కోసం తొమ్మిది మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోవాలని విద్యుత్ ఉత్పత్తి సంస్థలను కేంద్రం కోరింది.
2018-19 కంటే 4.5% వార్షిక వృద్ధి రేటుతో విద్యుత్ డిమాండ్ పెరుగుతోందని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
‘ ఏప్రిల్ నాటికి విద్యుత్ డిమాండ్ 2,05,000 మెగావాట్లను తాకుతుందని అంచనావేస్తు్నాము. జూన్- సెప్టెంబర్ నాటికి ఇది 2,15,000 మెగావాట్లకు చేరుకుంటుందని భావిస్తున్నాము అని తెలిపారు.
ఇప్పటి వరకు గరిష్ట విద్యుత్ డిమాండ్ జూలై 7, 2021న 12:01 గంటలకు 200,570 మెగావాట్లుగా ఉంది. ఈ ఏడాది ఆ రికార్డు బద్దలవుతుందని అనుకుంటున్నాము. అందువల్ల విద్యుత్ కేంద్రాల్లో తగినన్ని బొగ్గు నిల్వలు ఉండేలా చూడటం కీలక సవాలుగా మారుతోందని ఆయన అన్నారు.