– బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు
– అమోమయంలో క్యాడర్
– ఫ్లెక్సీల చుట్టే పాలిటిక్స్
– సోషల్ మీడియాలో ఫైట్
బీఆర్ఎస్ కు కొత్త తలనొప్పి వచ్చి పండింది. అదే పలు నియోజక వర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్యే ఆధిపత్య పోరు. ఇది పీక్స్ కి చేరుకోవడంతో కేడర్ అయోమయంలోకి జారుకుంటుంది. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్గపోరుకు ఫ్లెక్సీలు కారణమయ్యాయి. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల,పెద్ద పల్లి జిల్లాల్లో మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల చుట్టే రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి.
పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీలో బీఆర్ఎస్ నాయకుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ ఇజ్జగిరి రాజు ఏర్పాటు చేసి ఫ్లెక్సీని తొలగించారు. దాని స్థానంలో మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీంతో తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కావాలనే తొలగించి మరో నేత తన ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకున్నాడని ఆరోపిస్తూ.. ఆయన సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.
అంతే కాకుండా తాను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో బీఆర్ఎస్ నాయకుల ఫోటోలున్నాయని.. మరో నేత ఏర్పాటు చేసిన దాంట్లో కనీసం కేసీఆర్ లాంటి ముఖ్య నేతల ఫోటోలు కూడా లేవని ఆయన ఆరోపించారు. ఇక వేములవాడ రాజన్న సన్నిధిలోనూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ నాయకుల ఫ్లెక్సీలను తొలగించే ప్రక్రియ కొనసాగింది.
అయితే చల్మెడ లక్ష్మీనరసింహ రావు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మాత్రమే తొలగించి..మిగతా బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను స్థానిక మున్సిపల్ సిబ్బంది తొలగించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరో వైపు జగిత్యాల పట్టణంలోనూ ఫ్లెక్సీ వార్ మొదలైంది.
పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తాజా మాజీ మునిసిపల్ పర్సన్ బోగ శ్రావణి ఫోటో లేకపోవడం చర్చనీయాంశమైంది. పట్టణానికి చెందిన మిగతా అందరూ ముఖ్య నేతల ఫోటోలు పెట్టి ఆమె ఫోటో పెట్టకపోవడం నెట్టింట వైరల్ గా మారింది. పుండు మీద కారం చల్లినట్టు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కూడా మీడియా గ్రూపుల్లో ఫోటో, వీడియో షేర్ చేశారు.
ఇక బోగ శ్రావణి మామ వెంకటేశ్వర్లు బండి సంజయ్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్రలో కలిసినట్టుగా కామెంట్ చేశారు.అలాగే బీజేపి కౌన్సిలర్ ఆరోపణలకు సంబంధించిన వీడియోను, పత్రికా ప్రకటన కాపీని విడుదల చేశారు. ఏది ఏమైనా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ నేతల మధ్య ఫ్లెక్సీ వార్ పీక్స్ కు చేరుకుంది.మరి అధినాయకత్వం ఎలా దీన్ని కంట్రోల్ చేస్తుందో చూడాలి.