ప్రగతి భవన్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. బీఆర్ఎస్ నేతలు ఆయనపై తీవ్రస్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. రేవంత్ తీరును ఖండిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి సమర్థిస్తారా అని ప్రశ్నించారు.
దేశంలో ఉన్న పీసీసీలు అందరూ రేవంత్ తరహా కామెంట్స్ చేస్తారా అని సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. ఆయనపై పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ మూల సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ మార్చుకుందా అని నిలదీశారు. పక్కనే ఉన్న ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని.. అక్కడి ప్రభుత్వ ఆఫీసులను పేల్చేస్తారా? అంటూ సెటైర్లు వేశారు ఎమ్మెల్యే.
హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా రెండోరోజు రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్ ను మావోయిస్టులు పేల్చేయాలని అన్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు రగిలిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యేలు పిలుపునిస్తున్నారు. ఇది హేయమైన చర్య అంటూ ములుగు బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ములుగు మండలాధ్యక్షుడు బాదం ప్రవీణ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణానికి హాని చేయడం కోసం నక్సల్స్ తో జరిగిన లోపాయికారి ఒప్పందం, కుట్రలో బాగంగా రేవంత్ మాట్లాడారని తమకు అనుమానంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ బహిరంగ పిలుపు వెనుక మాజీ మావోయిస్టు, స్థానిక ఎమ్మెల్యే సీతక్క మధ్యవర్తిత్వాన్ని నెరపినట్లుగా తాము భావిస్తున్నామని అన్నారు. కావున రేవంత్ రెడ్డి, సీతక్క తదితరులపై కుట్ర కేసు నమోదు చేసి చట్ట ప్రకారం విచారణ జరిపించి ముఖ్యమంత్రికి ఉన్న ప్రాణహానిని తప్పించాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు.