గనులను గుంజుకుంటున్నారు. ఇసుకను జుర్రుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా పశువులిచ్చే పాలనూ విడిచిపెట్టడం లేదని తెలిసింది. హెరిటేజ్ డెయిరీని తెచ్చి… చిత్తూరులో ప్రభుత్వ డెయిరీలను మూయించారని పదే పదే చంద్రబాబుపై జగన్ చేసే విమర్శ. ఈ విమర్శలో నిజముంది కూడా. కాని ఇప్పుడు తమరు చేస్తుందేంటి మహానుభావా అని అడగాల్సిన పరిస్ధితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయనే జగన్ పాదయాత్రకు, తర్వాత ఎన్నికలకు ఫైనాన్సర్ అని చెబుతారు. అలాంటి పెద్దిరెడ్డి కుటుంబం శివశక్తి పాల డెయిరీని చిత్తూరు, కడప జిల్లాల్లో.. ఇంకా ఇతర రాయలసీమ ప్రాంతాల్లోనూ నడిపిస్తున్నారు.
ఇసుక మాఫియా పుణ్యమా అని.. పెద్దిరెడ్డి కుటుంబం.. చాలా చోట్ల బలపడింది.. కొత్తగా అనుచరులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. బలమున్న ప్రతి గ్రామంలోనూ రైతులెవరూ.. వేరే పాల కేంద్రానికి పోయటానికి లేదు.. వారంతా శివశక్తి పాల కేంద్రంలోనే పోయాలి. ఇది రూల్.. ప్రభుత్వ రూల్ కాదు.. అధికారపార్టీ వారి రూల్. అలా చాలా చోట్ల.. పాలను బలవంతంగా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. పాలు పోయకపోతే.. ఆ రైతుకు వేరే పథకాలు ఆగిపోతాయని బెదిరిస్తున్నారని సమాచారం.
అసలు శివశక్తి పాల డెయిరీ గురించి మొదట చెప్పింది ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఆయన చెప్పాకే.. అందరూ ఎంక్వయిరీ మొదలుపెట్టారు. అప్పుడు అందరికీ షాకిచ్చే నిజాలు బయటకొచ్చాయి. ఇతర పాల కేంద్రాలు అవి ప్రభుత్వపరమైనవైనా.. ప్రైవేటువైనా సరే.. మూసుకోవాల్సిందే.. చిత్తూరు, కడప జిల్లాల్లో శివశక్తి కేంద్రాలు మాత్రమే తెరిచి ఉంటాయి.. వాటికి మాత్రమే రైతులు పాలు పోయాలి. ఇవి ఆరోపణలు కాదు.. నిజాలు.. నిరూపిస్తానని ఎంపీ రఘురామకృష్ణంరాజు సవాల్ విసురుతున్నారు.
ఇప్పటివరకు ఈ ఆరోపణలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించలేదు. శివశక్తి డెయిరీ ప్రైవేటు లిమిటెడ్ లో డైరెక్టర్లుగా అంతా పెద్దిరెడ్డి కుటుంబీకులే ఉన్నారు. ఇది వారిదేనన్న సంగతి పాలు పోసేవారికి తెలుసు.. ఆయా ప్రాంతాల్లో ముఖ్యమైనవారందరికీ తెలుసు. కాకపోతే.. జగన్మోహన్ రెడ్డికి తెలుసా లేదా అన్నదే సస్పెన్స్. ఎందుకంటే ఇప్పటికీ అప్పుడప్పుడు హెరిటేజ్ పేరు చెబుతారు.. చిత్తూరు పోతే.. హెరిటేజ్ వలన.. ప్రభుత్వ డెయిరీ మూసేయాల్సి వచ్చిందని చెబుతారు. పైగా ఈ మధ్య ఆమూల్ తో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు కూడా ఈ విషయం చెప్పారు. పైగా తాము ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆమూల్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని.. దాన్ని బట్టే తమ వైఖరి తెలుసుకోండని కూడా సెలవిచ్చారు.
మరి రాయలసీమలో పాల వ్యాపారం.. అది కూడా బెదిరించి పాలు పోయించుకుంటున్న శివశక్తి పాల డెయిరీ వ్యవహారంపై ఏమంటారో చూడాలి.