తెలంగాణ రైతులను సీఎం కేసీఆర్ అయోమయానికి గురి చేస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. గత రబీలో అదనంగా 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు. ఉప్పుడు బియ్యాన్నికూడా అదనంగా తీసుకుంటుందని కేంద్రం చెప్పిందని గోయల్ గుర్తు చేశారు. ఈ అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే ఇచ్చామని.. వాటి సేకరణకు నాలుగు సార్లు గడువు పొడిగించామని అన్నారు.
అయినప్పటికీ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తోందని అన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రప్రభుత్వం ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి ఎందుకు తరలించలేదని మంత్రి ప్రశ్నించారు. ఐదేళ్లలో ధాన్యం సేకరణ మూడు రెట్లు పెంచడంతో పాటు.. రైతుకి ఇచ్చే ధరను కూడా 1.5 రెట్లు పెంచామని చెప్పారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు గడువు పొడిగించినా.. రైతుల నుంచి ధాన్యం సేకరణలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.