గతేడాది దేశ రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన పెగసస్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. పెగసస్ స్పైవేర్ ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం రాసుకొచ్చింది. దీనికి సంబంధించిన ఒప్పందం 2017లోనే ఇజ్రాయెల్ ప్రభుత్వంతో జరుపుకుందని వివరించింది. ఓ రక్షణ ఒప్పందంలో భాగంగా క్షిపణులతో పాటు పెగసస్ డీల్ కూడా కుదిరింది అనేది ఈ కథనం సారాంశం.
న్యూయార్క్ టైమ్స్ కథనంలో ఏముంది?
” ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ సంస్థ పదేళ్లుగా నిఘా సాఫ్ట్‌వేర్‌లను చట్టసభలు, నిఘా సంస్థలకు విక్రయిస్తోంది. అమెరికా ఎఫ్‌బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) ఎన్ఎస్ఓ దగ్గర ఈ స్పైవేర్‌ను కొనుగోలు చేసింది. కానీ దాన్ని వినియోగంలోకి తీసుకొని రాలేదు. భారత ప్రభుత్వం కూడా దీన్ని కొనుగోలు చేసింది. భారత్, ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. 2017 జులైలో మోడీ తొలిసారిగా ఇజ్రాయెల్ వెళ్లారు. ఓ భారత ప్రధాని ఇజ్రాయెల్‌లో పర్యటించడం అదే తొలిసారి. ఆ పర్యటనలో ఇరు దేశాల మధ్య రక్షణ వ్యవహారలపై 2 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. ఈ డీల్‌లో క్షిపణి వ్యవస్థతోపాటు.. పెగసస్ కూడా ఉంది. ఈ ఒప్పందం జరిగిన కొన్ని నెలల తర్వాత అప్పటి ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ భారత్‌లో పర్యటించారు. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడటంతో 2019 జూన్‌లో ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు అబ్జర్వర్ హోదాపై జరిగిన ఓటింగ్‌లో ఇజ్రాయెల్‌కు అనుకూలంగా భారత్ ఓటువేసింది” అని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం రాసుకొచ్చింది. సుమారు ఏడాది పాటు పెగసెస్ పై లోతుగా దర్యాప్తు జరిపామని తెలిపింది.
ఈ వార్త ఇప్పుడు దేశ రాజకీయాల్లో మరోసారి సంచలనంగా మారింది. విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. మోదీ ప్రభుత్వమే దేశద్రోహిలా మారిందని ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ట్విట్టర్ లో విమర్శించారు. ఇతరుల వ్యక్తిగత విషయాలను పెగసస్ ద్వారా తెలుసుకోవడం చట్టవిరుద్ధమైన చర్యని మండిపడ్డారు. ఇది దేశద్రోహానికి సమానమని అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టును, పార్లమెంటును కూడా ఈ విషయంలో కేంద్రం తప్పుదోవ పట్టించిందని రాజ్యసభ ఎంపీ శక్తిసిన్హ్ గోహిల్ తెలిపారు. ఈ విషయంలో ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి రూ.300 కోట్ల స్పైవేర్ కొనుగోలు చేసి.. ప్రతిక్షాలపై దీన్ని ప్రయోగిస్తారా అని గోహిల్ ట్వీట్ చేశారు. ఇలాంటి స్పైవేర్ ను వినియోగించి శత్రుదేశాలపై నిఘా పెట్టాల్సింది పోయి.. ప్రతిపక్షాలు, పాత్రికేయులపై నిఘా పెట్టడమేంటని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు.
దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పంధించలేదు. కానీ.. ప్రభుత్వ అధికారిక వర్గాలు ఈ కథనాన్ని కొట్టిపారేస్తున్నాయి. ప్రభుత్వం చేసుకునే ఒప్పందాలు రహస్యంగా ఉండబోవని జాతీయ మీడియా చెబుతోంది. పెగసస్‌ను రూపొందించింది ఓ ప్రైవేటు సంస్థ అని.. దీనిపై ఇజ్రాయెల్ ప్రభుత్వంతో ప్రత్యక్ష, పరోక్ష ఒప్పందాలేవి జరగలేదని అంటున్నాయి.