బ్రెజిల్ సాకర్ లెజెండ్ పీలే అంత్యక్రియలు మంగళవారం ముగిశాయి. అశ్రునయనాల మధ్య ఆయనకు కుటుంబ సభ్యులు అంతిమ వీడ్కోలు పంపారు. శాంటోస్‌లోని అత్యంత ఎత్తైన శ్మశాన వాటికలో పీలే అంత్యక్రియలను నిర్వహించారు. మరణాంతరం తన అంత్యక్రియలు అక్కడే నిర్వహించాలని గతంలో పీలే కోరుకున్నారని తెలుస్తోంది.
అంతకు ముందు పీలే భౌతిక కాయాన్ని విలా బెల్మిరో స్టేడియంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆయన భౌతికాయాన్ని కడసారి చూసేందుకు అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆయన భౌతిక కాయానికి ప్రముఖులు, అభిమానులు, ప్రజలు నివాళులు అర్పించారు.
సుమారు 3 లక్షల మంది అభిమానులు పీలేకు నివాళులర్పించారు. దేశ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లలూ కూడా పీలే పార్థివ దేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. తర్వాత ఆయన మృతదేహాన్ని అగ్నిమాపక శకటంలో శాంటోస్ వీధుల గుండా అంతియాత్ర చేశారు.
ఆ సమయంలో అభిమానులు ‘పీలే 10’జెర్సీని ప్రదర్శిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. పీలే (82) గత నెల 30న అనారోగ్యం బారిన పడి మరణించారు. సావోపాలోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 21 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌లో మూడు ప్రపంచకప్‌ల్లో ఆయన పాల్గొన్నారు. మొత్తం 1363 మ్యాచ్‌లాడి 1281 గోల్స్ చేశారు. ప్రపంచంలో మరే ఇతర ఆటగాడు ఇన్ని గోల్స్ సాధించలేదు.