ఓ వైపు బంగారు తెలంగాణ అని కేసీఆర్ సర్కార్ చెబుతుంటే.. మరో వైపు గ్రామాల్లో పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. పెండింగులో ఉన్న వేతనాలను చెల్లించి తమ కుటుంబాలను ఆదుకోవాలని.. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కనగర్తి గ్రామపంచాయతీ సిబ్బంది ఆదివారం గ్రామంలో వీధివీధినా తిరుగుతూ భిక్షాటన చేశారు.
ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ గత కొన్ని నెలల నుంచి జీతాలు రాక పిల్లల చదువులకు ఫీజు కట్టలేక, నిత్యం గ్రామంలో మురికి కూపాలను శుభ్రం చేస్తూ అనారోగ్యలపాలై ఆసుపత్రికి వెళ్దామన్నా చేతిలో చిల్లి గవ్వ లేదని గ్రామ పంచాయతీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం, అధికారులు, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మల్టీ పర్పస్ రద్దు చేసి తమ వేతనాలను మంజూరు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పైడిపల్లి నాగయ్య, సీహెచ్ ప్రభాకర్, శనిగరపు బాపు, పైడిపల్లి సప్న, తాళ్లపల్లి శంకర్, రమేష్ పాల్గొన్నారు.
ఇక చేసిన పనులకు నిధుల్లేవు.. చేయాల్సిన పనులకు డబ్బుల్లేవు. ఖాతాలో సొమ్ములున్నా.. వినియోగించుకునే పరిస్థితి లేదు. ట్రాక్టర్ల సులభ వాయిదాలు.. డీజిల్ బిల్లులు, కార్మికుల వేతనాలు చెల్లించలేకపోతున్నామని అంటున్నారు సర్పంచ్ లు. కొన్ని నెలలుగా జీతాల్లేని పంచాయతీ కార్మికులు ఆందోళన బాట పడుతున్నారు. దీంతో మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలానికి చెందిన వివిధ గ్రామాల సర్పంచ్ లు ఇటీవలే కొనుగోలు చేసిన ట్రాక్టర్లు.. మండల పరిషత్ కార్యాలయం వద్ద నిలిపి ధర్నాకు దిగడం చర్చనీయాంశమైంది.
ట్రాక్టర్లు వద్దని వాటి ఈఎంఐ, డీజిల్ బిల్లులు, కార్మికుల వేతనాలు చెల్లించలేకపోతున్నామంటూ… సర్పంచులు నిరసనకు దిగారు. వాటిని అక్కడే వదిలేసి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎలాగో అధికారులు సర్ది చెప్పడంతో తిరిగి తీసుకెళ్లారు. గ్రామ పంచాయతీల ఆర్థిక దుస్థితికి ఈ సంఘటన అద్దం పడుతోంది. కొన్ని నెలలుగా రాష్ట్ర ఆర్థిక సంఘం.. 15 వ ఆర్థిక సంఘం నిధులు రాకపోవడంతో గ్రామ పాలన కుంటుపడింది. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా.. ఇంటి పన్నుల ద్వారా వసూలు చేసిన నిధులైనా వాడుకుందామంటే.. డబ్బులు తీసుకోకుండా పంచాయతీ ఖాతాలు స్తంభింపచేశారంటూ సర్పంచ్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.