– అక్రమాలకు కేరాఫ్
– మారని ఎస్ఓటీ, టాస్క్ ఫోర్స్
– కాలం మారుతున్నా మారని వ్యవస్థ
– దారి తప్పి అక్రమ దందాలకు తెర!
– ప్రభుత్వానికి, నాయకులకు అనధికార గూండాలు!
– గప్ చుప్ గా సాగుతున్న వ్యవహారాలు
– చెప్పుకోదగ్గ కేసులు నిల్
– వేల ఆరోపణలు, వందల ఫిర్యాదులు..
– అయినా.. ఎవరికీ పట్టదు!
క్రైంబ్యూరో, తొలివెలుగు: పోలీస్ స్టోరీ సినిమాలో సాయి కుమార్ రేంజ్ లో కనిపించని నాలుగో సింహమే పోలీస్.. పోలీస్ అనే ఖాకీలు రాష్ట్రంలో వేళ్ల మీద లెక్కబెట్టుకునే అంతమందే ఉన్నారు. ఇది కాదనలేని వాస్తవం. ఎందుకంటే.. రాష్ట్రంలో పోలీసుల లింకులతో బయటపడుతున్న నేరాలు, ఘోరాలు అంతలా జరుగుతున్నాయి మరి. ఒకప్పుడు హైదరాబాద్ కు ఇతర ప్రాంతాల రౌడీషీటర్లు వచ్చి తిరగాలంటే భయపడేవారని చెబుతుంటారు. అప్పట్లో రౌడీషీటర్స్, మాఫియా గ్యాంగ్ ఆగడాలను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేశారు. రాత్రికి రాత్రి ఎవిరినైనా ఎత్తుకొచ్చేయడం.. గొడవలు జరిగితే వెంటనే వాలిపోవడం వీరి డ్యూటీ. శాంతి భద్రతల విషయంలో వీరి పాత్ర ఎంతో కీలకంగా ఉండేది. అజీజ్ రెడ్డి ఎన్ కౌంటర్ లో ఇప్పటి ఐజీ కమలాసన్ రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి మట్టుబెట్టడం సంచలనం. టాస్క్ ఫోర్స్ పవరేంటో అప్పుడే చాలామందికి అర్థం అయింది. రంగారెడ్డికి సిటీ విస్తరించడం.. దారి దోపిడీ దారులు పెరిగిపోతుండటంతో ఎస్పీ సురేంద్రబాబు ఉన్న సమయంలో ఎస్ఓటీని తీసుకొచ్చారు. కానీ.. సంఖ్య చాలా తక్కువగా ఉండేది. తర్వాత వివిధ జోన్స్ లో ఉండే అక్రమ దందాలకు, నేరాలకు అటాచ్ గా సిట్ బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తులు కొనసాగిస్తూ వస్తున్నారు. ఒకప్పటి నేరాలైతే ఇప్పుడు లేవు. అందోళనలు అసలే కనపడటం లేదు. ధర్నాలు ఉన్నా.. టీఎస్ఎస్పీ బలగాలే మోహరిస్తున్నాయి. కానీ.. టాస్క్ ఫోర్స్ వారు మాత్రం మూడు దందాలు ఆరు అక్రమాలుగా వారి వృత్తిని మార్చేసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక్కడే ఓఎస్డీలు ఎందుకుంటారు?
ఒక్కసారి టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన ఉన్నతాధికారి.. పదవీ విరమణ అయిపోయాక అక్కడే ఉండాలని చూస్తారు. ఇటీవల కాలంలో లింబారెడ్డి, ఇప్పటి రాధాకిషన్ రావులు ఎక్కవ కాలం ఉన్నారు. వీరు ఛేదించిన కేసులు పెద్దగా కనిపించవు. కానీ.. కొసరు కేసులను పట్టుకుని అసలు కేసులతో దందాలు చేసి దండిగా సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి. మాదకద్రవ్యాల కేసుల్లో నిత్యం హాడావుడి చేసినట్లు కనిపిస్తారు. కానీ.. మూలాలను పట్టుకోరని విమర్శలు వినిపిస్తుంటాయి. ఎక్సైజ్ శాఖ పట్టుకున్న కేసులు కూడా వీరు పట్టుకోలేదు. చివరికి సినిమా ఇండస్ట్రీ బాగోతాన్ని కూడా ఎక్సైజ్ శాఖనే బట్టబయలు చేసింది. ఇలా ఎన్నో విషయాల్లో పట్టుకుని సెటిల్మెంట్లు చేసుకుని బయటపడేవారని తెలుస్తోంది. ఐదేళ్లు టాస్క్ ఫోర్స్ నార్త్ , వెస్ట్ జోన్ లో పనిచేసిన సీఐ నాగేశ్వరరావు రూ.200 కోట్లు సంపాదించాడని పోలీసుల విచారణలో బయటపడుతోంది. అయితే.. ఈ స్థాయి వాళ్లే ఇలా ఉంటే బాస్ లు ఎంత సంపాదించారో విచారణ చేపట్టాలనే డిమాండ్ పెరుగుతోంది. నలుగురు అధికారులను బినామీగా పెట్టుకుని అక్రమంగా పోగేసుకున్న టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీలు ఉన్నారు. అక్కడే పని చేసి మరెక్కడా చేయాలన్న మనసు ఒప్పని వారు ఉన్నారంటే ఎంత రాబడి ఉందో అర్థం అవుతోందనే చర్చ సాగుతోంది.
ఇలాంటి అనధికారిక పోలీస్ బృందాలు అవసరమా?
కాలం మారింది. నేరాల తీరు మారుతోంది. ఎక్కడో నాలుగు గోడల మధ్య ఏసీ రూముల్లో కూర్చొని ఇక్కడి సొమ్ముని దోచేస్తున్నారు. తియ్యటి మాటలతో ఆత్మహత్యలను పురిగొల్పుతున్నారు. హత్యలు చేస్తున్నారు. ఇలాంటి రోజుల్లో ఇంకా ఎఫ్ఐఆర్ చేసే అధికారం లేని అధికారిక చిరునామా లేని ప్రైవేట్ సైన్యం అవసరమా? అని ప్రభుత్వాలు ఆలోచించాలని డిమాండ్ వినిపిస్తోంది.
ఉగ్రవాదులకు, మావోయిస్టులకు ప్రత్యేక టీంలు
కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ లాంటి సంస్థల పని తీరుతోనే ఇప్పటివరకు చాలామందికి చెక్ పడింది. కానీ.. టాస్క్ ఫోర్స్ ఎక్కడా ఇలాంటివి కనీసం గుర్తించలేదు.. పట్టుకోనూలేదు.
నాయకులకు ప్రైవేట్ సైన్యంగా!
అక్రమ ఆదాయం ఉన్న చోట మాముళ్ల రూపంలో, ల్యాండ్ సెటిల్మెంట్లకు టాస్క్ ఫోర్స్ అడ్డాగా మారిందనే అపవాదు ఉంది. ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టి.. వారం పది రోజులు బంధించి చిత్రహింసలకు గురిచేసి.. దారికి తెచ్చుకునే పనిలో ఉంటున్నారు ఎస్ఓటీ, టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర అని మహబూబ్ నగర్ కి చెందిన వారిని నిందితులుగా చేర్చి వారిపై కక్ష తీర్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి కళ్లలో అనందాన్ని చూపించేందుకే ఇలా చేశారని బాధితుల కుటుంబాలు మండిపడుతున్నాయి. అలాగే టీఆర్ఎస్ యువ నేత, మాజీ ఎంపీ, ఇప్పటి ఎమ్మెల్యే లవర్ ని మంచిర్యాలకు వెళ్లి బెదిరించి నాగేశ్వరరావు సెటిల్మెంట్ చేశాడు. ఆయన బావమరిదిపై వనస్థలిపురంలో కేసు అయితే.. సెటిల్మెంట్ చేసేందుకు బాధితులను భయాందోళనకు గురి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరి కోసం ఎందుకోసమని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది.
ఇప్పుడు మారకపోతే.. ఇంకెప్పుడు మారతారో!
మహిళల సేఫ్టీ అంటూ.. సైబర్ క్రైం అవగాహన పేరుతో లక్షల రూపాయల ఫండ్స్ ని పోలీస్ శాఖ ఖర్చు చేస్తూ ఉంటుంది. ఇది అవసరమే. కానీ.. నేరాలు తగ్గేలా ప్రతిభ కనబర్చటం లేదు. వాటికి కొత్త కొత్త పాలసీ విధానాలు తీసుకొచ్చారు. షీ టీంలు సక్సెస్ అయ్యాయి. ఇలా ప్రాక్టికల్ గా టాస్క్ ఫోర్స్, ఎస్ఓటీ టీంలను ప్రజలకు అవసరమయ్యే విధంగా ఉపయోగించునే పనులు అప్పగించాల్సి ఉంటుంది. అవినీతికి ఆజ్యం పోసేలా చేస్తున్న ఈ టీంల పై దర్యాప్తు చేస్తే ఎన్నో అక్రమాలు బయటపడుతాయని అంటోంది తెలంగాణ ప్రజానీకం.