హైదరాబాద్ మహా నగరానికి కూత వేటు దూరంలో ఉన్న భూ పట్టాదారులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. భూములు అమ్ముకోలేక… తమ పిల్లల పెళ్లిళ్లు చేయలేక నానా అవస్థలు పడుతున్నారు. 1996లో ఆనాటి ప్రభుత్వం తెచ్చిన 111జీవో కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చదువులకు, పెళ్లిళ్లలకు అవసరానికి భూమి పనిచేయటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అక్కడున్న వారంతా రైతులే. వారికున్న ఆస్తి అంతా భూములే. కానీ ఇప్పుడు తమ పిల్లల అవసరాల కోసం వాడుకునేందుకు అవేవీ పనిచేయటం లేదు. కారణం 111జీవో. ఆ భూములు ఎవరూ కొనేందుకు ముందుకు రావటం లేదు. ఒకవేళ వచ్చినా అతి తక్కువ రేటుకు సొంతం చేసుకుంటున్న వారే. సిటీ అంతా నిర్మాణాలతో వేగంగా విస్తరిస్తుంటే… అక్కడ మాత్రం ఎలాంటి నిర్మాణాలు లేక బోసిపోతుంది.
నాకు ఇద్దరు బిడ్డలు పెళ్లిళ్లకు ఉన్నారు. ఉన్నదే రెండు ఎకరాలు…అందులో ఓ ఎకరం అమ్మి పెళ్లిళ్లు చేద్దామనుకుంటే కుదరటం లేదని ఓ రైతు ఆవేదన చూస్తే అక్కడి పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. శంషాబాద్ చుట్టు పక్కల భూములు ఎకరం 2కోట్లకు పైగా అమ్ముతుంటే మా దగ్గర కనీసం 20లక్షలు పెట్టే వారు కూడా లేరంటున్నారు.
అసలు ఈ 111జీవో అంటే ఏంటీ?
జంట నగరాలకు త్రాగునీటి అవసరాలు తీర్చే ప్రధాన రిజర్వాయర్లున్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల క్యాచ్మెంట్ ఏరియాను కాపాడాలని తేల్చారు. ఆ వాటర్ బాడీలు దెబ్బతినకుండా ఉండేందుకు 1996లో ఆ రెండు జలాశయాలకు 10కి.మీ దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ప్రభుత్వం జీవో111ను విడుదల చేసింది. ఈ పరిధిలో దాదాపు 84గ్రామాలను చేర్చారు. దీంతో అక్కడ ఎలాంటి అభివృద్ధికి ఆస్కారం లేకుండా పోయింది.