ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దండయాత్రను అక్కడి సైన్యం ప్రాణాలకు తెగించిపోరాడుతోంది. ఉక్రెయిన్ సైన్యానికి తోడుగా సాధారణ పౌరులు సైతం శత్రువులపై పోరాడేందుకు ముందుకు కదులుతున్నారు. దేశ రక్షణ కోసం కొందరు ఆయుధాలు చేతబట్టి పోరాటం చేస్తుంటే.. ఇంకొందరు సాహసోపేత చర్యలకు పూనుకుంటున్నారు. ఉక్రెయిన్ రాజధానిలోకి క్రెమ్లిన్ బలగాలు చొరబడకుండా కీవ్ సమీపంలోని ఓ గ్రామవాసులు కృత్రిమంగా వరదలు సృష్టించారు.
వారు నష్ట పోతారని తెలిసినప్పటికీ.. శత్రుమూకలను అడ్డుకోడానికి వారు నివసిస్తున్న ఊరిని సైతం ముంచేశారు. కీవ్‌కు ఉత్తరంలోని దిమిదివ్ అనే గ్రామం నుంచి రష్యన్ ట్యాంక్‌లు వెళ్లకుండా నిరోధించేందుకు అక్కడ ప్రజలు వరదలు తీసుకొచ్చారు. సమీపంలోని దినిప్రో నది నుంచి మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసి వీధులు, పొలాల్లోకి తరలించారు. వరద నీటితో గ్రామంలోని పంట పొలాలు, ఇళ్లు మునిగిపోయాయి.
వీధులన్నీ నదులను తలపించడంతో రష్యా కాన్వాయ్‌లు ముందుకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. కృత్రిమ వరదలతో గ్రామం దెబ్బతిన్నప్పటికీ.. మా దేశాన్ని కాపాడుకునేందుకు ఎంత నష్టాన్నైనా భరిస్తామని అంటున్నారు గ్రామస్థులు. మాస్కో సైన్యాలపై వ్యూహాత్మక సాధించడానికి గ్రామవాసులు చేసిన ప్రయత్నం ఫలించిందని చెప్పారు ఆంటోనినా కోస్తుచెంకో అనే రిటైర్డ్ ఉద్యోగి. తాము చేస్తున్న పని ప్రతి ఒక్కరికీ అర్థమైందని.. తప్పు చేశామని ఎవరూ బాధపడట్లేదని.. కీవ్‌ను కాపాడుకోగలిగామని గర్వంగా చెప్పారు.
కాగా.. కృత్రిమ వరదలకు సంబంధించిన దృశ్యాలను ఉక్రెయిన్ ప్రభుత్వ అధికారి ఒకరు తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. “కీవ్‌ను కాపాడుకోడానికి దిమిదివ్ ప్రజలు తమ పంట పొలాలను, ఇళ్లను నీటముంచారు. సామాన్య పౌరులు హీరోలుగా మారుతున్నారు.. దీనికి మేం ఏ మాత్రం కలత చెందడం లేదు.. మా లక్ష్యం విజయమే.. ధైర్యం మా డీఎన్‌ఏలోనే ఉంది” అని ఆయన ట్వీట్ చేశారు.