తెలంగాణ ప్రభుత్వం 317 జీవోను సవరించి ఉద్యోగులకు న్యాయం చెయ్యాలని బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డా ఎన్. గౌతమ్ రావు డిమాండ్ చేశారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రజల కోరిక, ఆకాంక్షల మేరకే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు బీజేపీ మద్దతిచ్చిందని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను కప్పిపుచ్చేందుకు.. ప్రజల ఆలోచనలను పక్క దారి పట్టిచేందుకు ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేసే కార్యాన్ని ప్రభుత్వం ముందటేసుకుందన్నారు. ఇవన్నీ చూస్తుంటే దొంగే.. దొంగా దొంగా అన్నట్టుందని ఆయన వ్యాఖ్యానించారు. కాకినాడ తీర్మానంతో చరిత్రలోనే.. రాజకీయ తీర్మానం చేసిన తొలి పార్టీగా బీజేపీ నిలిచిందన్నారు.
బీజేపీ మద్దతు లేనిదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందా..? అని ప్రశ్నించారు. మంత్రి నిరంజన్ రెడ్డి చరిత్రను తెలుసుకొని మాట్లాడాలని మండిపడ్డారు. విద్యార్ధుల త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రంలో మంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత అమరవీరులను.. వారి త్యాగాలను మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మరోవైపు దేశంలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నౌక అని అన్నారు. అందుకే ఆ పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని పిల్లిగంతులు వేసినా.. ఇటు రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ అధికారంలోకి రావడం కష్టమని అన్నారు. రానున్న రోజుల్లో కేంద్రంతో పాటు.. తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు గౌతమ్ రావు.