పాకిస్తాన్ లో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఆహార సంక్షోభం దేశాన్ని కుదిపి వేస్తోంది. నిత్యావసరాల ధరలు రోజురోజుకూ కొండెక్కిపోతుండగా ఆహార కొరత పెరిగిపోతోంది. ప్రభుత్వం ఏమీ చేయలేక చేతులెత్తేయడంతో ప్రజలు ఆహారం కోసం ఘర్షణలకు దిగుతున్నారు. వంట గ్యాస్ కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. గ్యాస్ ని ప్రమాదకరంగా ప్లాస్టిక్ బ్యాగుల్లో తీసుకువెళ్తున్న దృశ్యాలు వీడియోలకెక్కుతున్నాయి.
ఇటీవల లాహోర్ లో గోధుమపిండిని తీసుకువెళ్తున్న ట్రక్కు వెంట కొందరు పరుగులు తీస్తుండగా .. మరికొందరు బైక్ ల పైన వాహనాన్ని వెంటాడుతున్న వీడియోను జమ్మూ కశ్మీర్ కి చెందిన సజ్జాద్ రజా అనే ప్రొఫెసర్ షేర్ చేశారు. ఈయన జమ్మూ కశ్మీర్ గిల్గిట్ బాల్టిస్టాన్ అండ్ లడఖ్ నేషనల్ ఈక్వాలిటీ పార్టీ చైర్మన్ కూడా.. ‘ఇది మోటార్ సైకిల్ ర్యాలీ కాదని, గోధుమ పిండిని తీసుకువెళ్తున్న ట్రక్కు వెంట బైకులు నడుపుతూ ‘ఛేజ్’ చేస్తున్న అన్నార్తులని’ ఆయన అన్నారు. ‘కేవలం ఒక్క ప్యాకెట్ పిండి దొరికితే చాలని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీళ్ళు ఇలా ఆ వాహనం వెంట బడుతున్నారు. పాకిస్థాన్ లో అసలు భవితవ్యం అంటూ ఉందా ? ఆ దేశంలో ఏం జరుగుతోందో చూపడానికి ఈ చిన్న వీడియో చాలు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
జమ్మూ కశ్మీర్ ప్రజలు కళ్ళు తెరవాలని, తాము పాకిస్తాన్ లో లేనందుకు అదృష్టవంతులమని పొంగిపోవాలని ఆయన ట్వీట్ చేశారు. ఈ వీడియోలో కొందరు ఆ ట్రక్కుకు దగ్గరగా వచ్చి చేతిలో కరెన్సీ చూపుతూ తమకు పిండిని అమ్మాలని దీనంగా అభ్యర్థిస్తున్న దృశ్యం ఆ దేశంలోని పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. పరుగులు తీసినవారు, బైకులపై వచ్చిన వారితో ఆ ప్రాంతమంతా రద్దీగా మారిపోయింది.
పాకిస్తాన్ లో 15 కిలోల పిండి బస్తాను 2,050 రూపాయలకు అమ్ముతున్నారు. కేవలం కొన్ని రోజుల్లోనే ఇది మొదట 150 రూపాయలకు,
ఆ తరువాత 300 రూపాయలు పెరిగిపోయింది. ఇలా అన్ని వస్తువుల ధరలూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ద్రవ్యోల్బణం 24.5 శాతానికి పెరిగింది. ఈ ఆహార సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు పాక్ ప్రభుత్వం సాయం కోసం ఎదురుచూస్తోంది. అయితే సైన్యానికి మాత్రం ప్రభుత్వం అత్యధిక బడ్జెట్ కేటాయిస్తోందన్న వార్తలు వస్తున్నాయి.