ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే కొడంగల్ నియోజకవర్గం.. ప్రస్తుతం గొడవలు, కేసులతో అల్లకల్లోలంగా మారింది. కర్నాటకకు ఆనుకొని ఉన్న ఈ నియోజకవర్గం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక అభివృద్ధి చెందిందని చెబుతుంటారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న 10 సంవత్సరాల కాలంలో కేసులు, గొడవలు, దాడుల ప్రస్తావనే లేదనేది విశ్లేషకుల మాట. 2018లో రేవంత్ ఓడిపోయి టీఆర్ఎస్ నుంచి పట్నం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. గొడవలు, దాడులు విపరీతంగా పెరిగిపోయాయని చెబుతున్నారు.
పట్నం మహేందర్ రెడ్డి తాండూరులో ఎలాంటి రాజకీయాలు చేశారో.. కొడంగల్ లో నరేందర్ రెడ్డి కూడా రౌడీ రాజకీయాన్ని నమ్ముకున్నారనే చర్చ నియోజకవర్గంలో పెద్దఎత్తున జరుగుతోంది. పెన్షన్ రావడం లేదంటే ఇళ్లపై దాడులు.. రోడ్డు బాలేదంటే మహిళపై దాడి, మా భూమి ఎమ్మెల్యే మామా కబ్జా చేశాడు అంటే కేసులు ఇలా ఎన్నో జరుగుతున్నాయి. ఇసుక మాఫియా దందా, భూ కబ్జాలే ప్రధాన ఆదాయంగా అధికార పార్టీ నేతలు మార్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడమే అభివృద్ధి అని ఎమ్మెల్యే భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని ప్రజలే బహిరంగంగా అంటున్న పరిస్థితి.
బీసీ రుణాలు కావాలంటే కమీషన్.. సీఎంఆర్ఎఫ్ చెక్కు కావాలంటే కమీషన్.. రోడ్డు వేయాలి అంటే కమీషన్.. షాప్ లు నడుపుకోవాలి అంటే కమీషన్.. ఇలా ప్రతీ పనిలో ఎమ్మెల్యే మనుషులకు అమ్యామ్యాలు ఇవ్వాల్సిందేనట. అధికార పార్టీ నేతల అరాచకాలకు దోపిడీకి కొమ్ముకాసే పోలీసులు మరోవైపు.. ఇదీ మొత్తంగా కొడంగల్ లో సాగుతున్న టీఆర్ఎస్ పాలన అని నియోజకవర్గం మొత్తం చర్చించుకుంటోంది.
రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సొంత నిధులతో అభివృద్ధి పనులకు భూములు కొనిచ్చారని.. ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు.. పనులు స్పీడ్ గా అవ్వాలని కాంట్రాక్టర్లకు చెప్పేవారని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. అలాంటి నేతను ఓడించి పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించిన కొడంగల్ ప్రజలకు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయని చెబుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నా అని ఎమ్మెల్యే అంటారు కానీ.. ఏ పనీ జరగడం లేదని శుభకార్యాలకు వెళ్లడమే అభివృద్ధి అనుకుంటున్నారా? అని స్థానిక యువత ప్రశ్నిస్తోంది.
ఇక కొడంగల్ లో పోలీస్ వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీ జేబులో సంస్థగా మారిపోయిందనే విమర్శలు ఉన్నాయి. కండువా కప్పుకోవడం తప్ప టీఆర్ఎస్ నేతలు పోలీసులు సేమ్ టు సేమ్ అనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలు, అవినీతి, పోలీసుల పక్షపాత వైఖరిపై పూర్తి సాక్షాలతో తొలివెలుగులో వరుస కథనాలు ఉంటాయి.