మాట తప్పితే తల నరుక్కుంటా.. ఇదీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫేమస్ డైలాగ్. ఏడేళ్లుగా అనేక విషయాల్లో పదే పదే మాట తప్పారు కానీ.. తల మాత్రం ఎప్పుడూ నరుక్కోలేదు. ఆవేశంలో ఆ మాట అని ఉంటారు కాబట్టి ఎవరూ ఆడిమాండ్ కూడా చేయలేదు. అయితే ఇప్పటిదాకా ఎన్నికల్లో ఇచ్చిన హామీల వరకే ఆ మాట తప్పడం పరిమితమవుతూ వచ్చింది కానీ.. ఇప్పుడు ఆ మాట తప్పే అలవాటు కేసీఆర్‌కు మరింత శృతి మించుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి పదవి విషయంలోనే కాదు.. తానే ముఖ్యమంత్రి అయ్యాక కూడా అదే పనిగా మాట తప్పుతూనే ఉన్నారని అనేక వర్గాలు కేసీఆర్‌పై మండిపడుతున్నాయి. నెలకో హామీ ఇవ్వడం.. మరో నెలకల్లా దాన్ని మర్చిపోవడం ఆయనకు పరిపాటిగా మారిపోయిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
జాబ్ నోటిఫికేషన్లు వాయిదా.. సర్కార్ ఉద్యోగుల జీతాలు వాయిదా.. ఆసరా సాయం వాయిదా.. కొత్త పెన్షన్లు వాయిదా.. రుణమాఫీ వాయిదా..బిల్లులు చెల్లింపు వాయిదా... ఇవీ దిగ్రేట్ ధనిక రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు తప్పుతున్న మాటల వరుస. దళిత బంధు పేరుతో కోరని వారికి కూడా రాత్రికి రాత్రే కోట్ల రూపాయలు ఇస్తున్న ముఖ్యమంత్రి.. సర్కార్ చేసే వేసే డబ్బులతోనే జీవితాలు వెళ్లదీసే తమ నోట్లో మాత్రం మట్టిగొడుతున్నారని అనేక వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి నెలా ఠంచన్‌గా ఒకటో తారీఖునే పడాల్సిన ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ఎప్పటికీ పడతాయో తెలియని పరిస్థితి ఇప్పటికే నెలకొనగా.. మిగిలిన అందరి పరిస్థితి అలాగే తయారైంది. ఆసరా పెన్షన్లు అందుకునే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్‌ఐవీ, ఫైలేరియా బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నెలాఖరు దగ్గరపడుతున్నా.. పెన్షన్‌కు దిక్కులేకుండాపోయింది. దీంతో వాటిని నమ్ముకున్న లబ్ధిదారులు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. అసలు వస్తాయా లేదా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక సెప్టెంబర్ నెల నుంచి 57 ఏళ్లు పైబడిన వారికి కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి.. అసలు లబ్ధిదారుల ఎంపికే చేయలేదు.
Advertisements
ఇక గత నెల వరకే రూ. 50 వేలలోపు రైతుల పంట రుణాల మాఫీ చేస్తానని.. ఆ మాట కూడా తప్పేశారు. ఈ స్కీం కూడా వాయిదాల మీద వాయిదా పడుతోంది. 2018లోనే లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పి చేతులెత్తేసిన సర్కార్.. మొన్న ఆగస్టు 1న. రూ.50 వేల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ఆగస్టు 16-31 లోగా అమలు చేస్తామని తెలిపింది. అది కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇక రెండు రోజుల్లో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ 9 నెలల కింద ప్రకటించగా.. దానికీ అతీగతీ లేకుండా పోయింది. లక్షలాది మంది నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తోంటే.. చోద్యం చూస్తోంది. అటు గ్రామ అభివృద్ధి పనుల బిల్లులనూ చెల్లించకపోవడంతో సర్పంచులు ఆత్మహత్యలే చేసుకుంటున్నారు. కానీ కేసీఆర్ సర్కార్ మాత్రం అలాగే సోయి లేకుండా ప్రవర్తిస్తోంది. దీంతో ఇచ్చిన మాటను తప్పడమే కాదు.. సర్కార్ కట్టుబాట్లను కూడా తప్పిన కేసీఆర్.. ఎన్ని సార్లు తల నరుక్కుంటారో చూస్తామని ఆయా వర్గాలు కేసీఆర్‌పై నిప్పులు చెరుగుతున్నాయి.