సర్పంచ్ కు ఇచ్చేస్తే సరిపోతదా… మా వాటా సంగతేంటీ అంటూ అవినీతి మరక అంటించుకున్న మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తన నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులతో జనం దృష్టి మరల్చే ప్రయత్నం బెడిసికొట్టింది. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీ నగర్ ప్రధాన రహదారిపై 8 కోట్లతో చేపట్టిన రోడ్డు పనులకు ఏకంగా 2 కిలోమీటర్ల ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో భారీగా జనం, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. కానీ ఏ ఒక్కరికి మాస్కులు లేవు. సోషల్ డిస్టెన్స్ కూడా పాటించలేదు.
తెలంగాణలో సెకండ్ వేవ్ ప్రకంపనలు సృష్టిస్తోన్న వేళ… మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పాల్సింది పోయి… మంత్రే కరోనా నిబంధనలకు తూట్లు పొడవడంపై స్థానికులు మండిపడుతున్నారు. పది మందికి చెప్పాల్సిన మంత్రే నిబంధనలు పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ర్యాలీలో పాల్గొన్న కార్పొరేటర్లు కూడా ఒక్కరూ మాస్కు ధరించలేదు. మేడ్చల్ జిల్లాలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అసలు ఈ ర్యాలీకి ఎవరు అనుమతి ఇచ్చారని జనాలు ప్రశ్నిస్తున్నారు. 8 కోట్లతో చేపట్టిన రోడ్డు పనులకు ఇంత మందితో ర్యాలీ అవసరమా? అని ఫైర్ అవుతున్నారు.
మంత్రి మల్లారెడ్డిపై ఇప్పటికే సీఎం కేసీఆర్ కాస్త సీరియస్‌గా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న దశలో… మంత్రి మల్లారెడ్డి వ్యవహార శైలి హాట్‌టాపిక్‌గా మారింది.