అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ సంచలన ప్రకటన చేశారు. బాల్య వివాహాలు చేసుకునే వారిని శుక్రవారం నుంచి అరెస్టు చేయనున్నట్టు చెప్పారు. వివాహ వయసు నిండని బాలికలను ఇప్పటికే పెండ్లి చేసుకున్న వారిని సైతం అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.
ఇక నుంచి 14 ఏండ్ల లోపు బాలికలను వివాహం చేసుకునే వారిపై ఫోక్సో చట్టం కింద కేసులు పెడతామన్నారు. రాష్ట్రంలో బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసేందేకే ఇలాంటి కఠిన నిర్ణయాలను అమలు చేయాల్సి వస్తోందన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే బాల్య వివాహాలపై 4000లకు పైగా కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. బాల్య వివాహాలను ఆపేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ప్రజలు మద్దతు తెలపాలని ఆయన కోరారు.
బాల్య వివాహం చేసుకునే వారిని దానిలో పాలు పంచుకునే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 14ఏండ్లలోపు లైంగిక సంబంధాలు పెట్టుకోవడం నేరమని ఆయన ఇప్పటికే తెలిపారు. రాబోయే ఐదారు నెలల్లో వేలాది మంది భర్తలను కటకటాల్లోకి నెడతామన్నారు.