ఖమ్మంలో జరుగుతున్న బీఆర్ఎస్ బహిరంగ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సభ దేశానిక ఓ దిక్సూచీ లాంటిదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, తెలంగాణ సాయుధ పోరాటంలో రాచరికాన్ని తరిమికొట్టిన ధీరులని అన్నారు.
తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు కేరళలోనూ అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. కంటి వెలుగు అద్భుతమైన పథకమని కొనియాడారు పినరయి. రాజ్యాంగాన్ని కాపాడేందుకు జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ చేపట్టిన పోరాటానికి తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
రాచరిక వ్యవస్థను తెలంగాణ ప్రజలు ఏవిధంగా తరిమి కొట్టారో.. దేశంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అలాగే కూల్చాలని పిలుపునిచ్చారు. బీజేపీ వ్యతిరేక పోరాటం కూడా తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని అన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా దేశంలో ప్రధాని మోడీ పాలన కొనసాగుతోందని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగాన్ని కాపాడేందుకు బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ పోరాటం ప్రారంభించడం అభినందనీయమని వెల్లడించారు. అంతే కాకుండా రాజ్యాంగాన్ని కాపాడేందుకు దేశంలో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. కీలక నిర్ణయాల్లో కేంద్ర రాష్ట్రాలను పరిగణలోకి తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.