నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాల్టీలో కిలోమీటరున్నర మేర రోడ్డును 66 అడుగులకు విస్తరించాల్సి ఉంది. అందుకోసం ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే ఇళ్లు కూల్చివేస్తున్నారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇంట్లో ఉన్న సామాను కూడా తీసుకోనివ్వడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
2022 మార్చిలో కోస్గి మున్సిపాల్టీ రెండు వైపులా కూడా 33 అడుగుల మేర అక్రమణల్ని తొలగించాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు రోడ్డు విస్తరణకు అడ్డంకిగా ఉన్న సుమారు 153 ఇళ్లు, దుకాణాలు, భవనాలకు పురపాలిక అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ వారు స్పందించకపోవడంతో అధికారులు పోలీసు బందోబస్తుతో కూల్చివేతలు మొదలు పెట్టారు.
సమాచారం లేకుండా ఇళ్లు కూల్చేశారని కొందరు అంటుంటే.. ఉన్న గూడు పోయి రోడ్డున పడ్డామని మరికొందరు వాపోయారు. పరిహారం చెల్లించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పరిహారం చెల్లించాలంటూ 16 మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిరుపేదలనే కారణంతో మరో 16 ఇళ్ల జోలికి వెళ్లలేదు. 66 అడుగుల రోడ్డును స్థానికులు, ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో 50 అడుగులకు పరిమితం చేశారు.
కలెక్టర్ ఆదేశాల మేరకే ఇళ్లు కూల్చివేస్తున్నాం.16 మంది నిరుపేదల ఇళ్ల జోలికి మేము పోలేదు. మిగతా వారికి నష్ట పరిహారం ఇవ్వడానికి వారి దగ్గర ఇంటికి సంబంధించిన సరైనా పత్రాలు లేవు. అవి గ్రామకంఠం భూములు అందుకే మా పై అధికారుల ఆదేశాల మేరకు మేము ఇళ్లు కూల్చివేస్తున్నామని కోస్గి మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్ పేర్కొన్నారు.