కర్ణాటక బీజేపీ చీఫ్ నలిన్ కుమార్ కతీల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ భజన చేసే వాళ్లే రాష్ట్రంలో ఉండాలంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. యలబుర్గ ప్రజలు హనుమంతున్ని పూజిస్తారా? లేదా టిప్పు సుల్తాన్ ను పూజిస్తారా? అని ఆయన ప్రశ్నించారు.
కర్ణాటకలోని యలబుర్గలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ…. మనమంతా శ్రీరాముడు, హనుమంతుడి భక్తులమని ఆయన చెప్పారు. అంతేకాని టిప్పు సుల్తాన్ వారసులం కాదని పేర్కొన్నారు. టిప్పు సుల్తాన్ వారసులను మనం తిప్పి పంపించామన్నారు.
అందుకే తాను యలబుర్గ ప్రజలను ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నానన్నారు. మీరు హనుమంతున్ని పూజిస్తారా లేదా టిప్పు భజన చేస్తారా..? చెప్పాలన్నారు. ఆ తర్వాత వెంటనే టిప్పు సుల్తాన్ భజన చేసేవాళ్లను తరిమి కొడతారా..? అని ఆయన ప్రశ్నించారు.
ఒక్కసారి ఆలోచించండని వారిని ఆయన కోరారు. ఈ రాష్ట్రం టిప్పు సుల్తాన్ వారసులదా లేదంటే శ్రీరాముడు, హనుమంతుడి భక్తులదా..? అని ప్రశ్నించారు. టిప్పును ప్రేమించే వాళ్లు ఈ రాష్ట్రంలో ఉండొద్దన్నారు. శ్రీరాముడి భజనలు, హనుమంతుడి ఉత్సవాలు జరుపుకునేవారు మాత్రమే ఇక్కడుండాలని ఆయన అన్నారు.