నువ్వా-నేనా అన్నట్లు సాగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది…? ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి…? ఎంత ఓటింగ్ శాతం దక్కించుకోనున్నాయి….? దుబ్బాక ఉప ఎన్నిక వరకు ఎన్నో ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ను పక్కాగా అంచనా వేసిన ప్రతిష్టాత్మక పీపుల్స్ సర్వే ఎగ్జిట్ పోల్స్ గ్రేటర్ లోనూ ఓటర్ల నాడిని పసిగట్టే ప్రయత్నం చేసింది.
‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈసారి ఎన్నికల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు, నిరుద్యోగం, వరద బాధితులకు సహాయం వంటివి ఎన్నికల్లో ప్రధానాంశాలుగా నిలిచాయి. డబుల్ బెడ్రూం ఇండ్లు 28 శాతం, నిరుద్యోగుల సమస్య 21 శాతం, వరద బాధితులకు సాయం 16 శాతం, ట్రాఫిక్ రద్దీ సమస్య 12 శాతం, రోడ్ల సమస్య 10 శాతం, పారిశుభ్రత 9 శాతం మంది, ఇతర అంశాలు 5 శాతం ప్రభావితం చూపనున్నాయి.
ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయంటే…
‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం టీఆర్ఎస్ కు 38 శాతం, బీజేపీకి 32 శాతం, ఎంఐఎం 13 శాతం, కాంగ్రెస్ కు 12 శాతం, ఇతరులకు 5 శాతం ఓట్లు వచ్చే అవకాశముంది. ఇందులో మూడు శాతం ఓట్లు అటు ఇటు అయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం టీఆర్ఎస్, బీజేపీకి మధ్య 6 శాతం ఓట్ల వ్యత్యాసం ఉండే అవకాశముంది.
చాలా డివిజన్లలో ముఖాముఖి పోరు నెలకొనగా…. అతి తక్కువ మెజారిటీతో కొన్ని స్థానాలు టీఆర్ఎస్ పరం అయ్యే అవకాశం కనపడుతుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా ఓట్లు, సీట్ల శాతాన్ని పెంచుకోగలిగింది. బీజేపీ 2016 ఎన్నికల్లో తెలుగుదేశం పొత్తుతో 4 వార్డులు మాత్రమే గెలుచుకుంది. ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి సీట్ల సంఖ్యను 6 రెట్లు పెంచుకోనుంది.
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈసారి పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఎంపీ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మాత్రమే కొంత పోటీ ఇవ్వగలిగింది. సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడింది.
టీఆర్ఎస్ పార్టీకి సీట్ల తగ్గింపులో సిట్టింగ్ కార్పోరేటర్ల అవినీతి, వసూళ్లతో పాటు వరద సహాయంలో అక్రమాలు కీలకంగా కనిపిస్తున్నాయి. మజ్లిస్ తక్కువ సీట్లలో పోటీ చేయటం టీఆర్ఎస్ కు కలిసి రాగా, మజ్లిస్ పోటీలో లేని చోట ముస్లీం సామాజికవర్గం అంతా టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపింది.
అయితే, బీజేపీ అనుకున్నట్లుగా హిందూ ఓట్లన్నీ గంప గుత్తగా బీజేపీకి పడలేదని ఫలితాలు నిరూపించబోతున్నాయి.
ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే…
టీఆర్ఎస్ కు 68-78
బీజేపీకి 25-35
ఎంఐఎంకు 38-42
కాంగ్రెస్ కు 1-5
75 స్థానాలు గెలిచిన పార్టీకి మేయర్, డిప్యూటీ మేయర్ స్థానం గెలుచుకోనుంది.