చేతులు జోడించి, కన్నీళ్లతో “మమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకోండి” అని మీడియా ముందు వేడుకొంటున్న ఆర్టీసీ ఉద్యోగిని చూస్తూ ఉబికి వస్తున్న కన్నీళ్లని ఆపుకొని పక్కకు చూస్తే నాతో పాటు వార్తలు చూస్తున్న మా ఆవిడ ఏడ్చేస్తోంది.
తప్పు ఎవరిది? సమ్మె చేసే హక్కు వుందా లేదా? అన్న మీమాంసకి అతీతంగా తెలంగాణ ప్రభుత్వం మరి ముఖ్యంగా పౌర సమాజం స్పందించాల్సిన చారిత్రక సమయం ఇది. సమ్మె హక్కు సంగతి వదిలేయండి. కనీసం బతికే హక్కును గుర్తించాలి.
ప్రాణాలు పణంగాపెట్టి సొంత రాష్ట్రం సాధించుకొన్న ఆత్మాభిమానం మీడియా ముందు కన్నీళ్ల పర్యంతమవటం అత్యంత దయనీయమైన విషయం.
ఒక మనిషి రోడ్డున పడి ఏడవాలి అంటే ఎంత ఆత్మాభిమానం చంపుకోవాలో, ఎంత అంతర్మథనం చెందాలో, ఎంత కడుపు కాలాలో అంతా అయ్యింది. ఒక్కసారి అతని స్థానంలో నేనుంటే అని ఆలోచించండి.
రేపో మాపో వచ్చే బంగారు తెలంగాణ ఏమోగాని, తక్షణం మానవీయ తెలంగాణ కావాలి.