వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో ఎర్ర బంగారం ధరలు దుమ్మురేపుతున్నాయి. దేశీ రకం మిర్చి ధర రికార్డు బ్రేక్ చేస్తూ ఏకంగా బంగారం రేటుతో పోటీ పడుతూ దూసుకుపోతోంది. రోజురోజుకూ ధర పెరిగిపోతూ క్వింటాకు గరిష్ట ధర రూ.44 వేలు పలుకుతూ మార్కెట్ చరిత్రనే తిరగరాసి రైతులకు కాసుల పంట పండిస్తోంది.
సింగిల్ పట్టి రకం రూ.42,500 ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఏడాది మిర్చి ధరలు పెరిగాయని వ్యాపార వర్గాలు వెల్లడించాయి. దిగుబడి లేకపోవడం.. అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ ఉండటం కారణంగా ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని వ్యాపారులు చెప్తున్నారు.
ఈ ఏడాది మిర్చి దిగుబడి సగానికి సగం పడిపోయినప్పటికీ.. ధర ఆశాజనకంగా ఉందని రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండో కోత చేతికి రావడంతో రైతులు పంటను మార్కెట్ కు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు.
గతేడాది ఎకరాకు 20 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడి వచ్చింది. కానీ.. ఈ సంవత్సరం 10 క్వింటాల వరకే రావడం గగనమైంది. కొన్నిచోట్ల అయితే ఎకరాకు 4, 5 క్వింటాలు మాత్రమే వస్తోంది. అయితే.. రానున్న రోజుల్లో మిర్చి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.