నారగొని ప్రవీణ్ కుమార్, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు
మన తెలంగాణ రాష్ట్రంలో 24 లక్షల అసైన్డ్ భూమిని 14 లక్షల రైతు కుటుంబాలు వ్యవసాయం చేసుకొని జీవనోపాధిని పొందుతున్నాయి. వీరిలో అత్యధికులు దళితులు, గిరిజనులు వెనకబడిన తరగతి వారే ఉన్నారు. ఏపీ రాష్ట్రంలో జూన్ 18,1954 న.. తెలంగాణలో మే 25, 1958 కంటే ముందు ఎవ్వరైతే అసైన్డ్ భూములు కలిగి ఉన్నారో.. వారి భూమిని పట్టా భూమిగా పరిగణించి వాటికి శాశ్వత హక్కును కల్సించాలి. అంటే అమ్ముకునే హక్కు కూడా ఉంటుందని గౌరవ హైకోర్టు రెండు సమయాలలో చెప్పింది. wpno:30526/2012, wpno:15438/2012 లో స్పష్టమైన తీర్పును ఇచ్చింది. ఇట్టి తీర్పును అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.
MS no.575 నంబర్ ను నవంబర్ 16, 2018 న ఉత్తర్వులు ఇచ్చింది. దీని వలన ఆ రాష్ట్రంలో సుమారు 3లక్షల ఎకరాల భూమి పట్టా భూమిగా మారి పోయింది. ఈ భూమిని నిషేధిత జాబితా.. అంటే సెక్షన్ 22- A నుండి కూడా తొలగించి అక్కడి రైతులకు పూర్తి యాజమాన్య హక్కులు కలిపించింది ఏపీ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ తీర్పును అమలు చేయలేకపోవడం దురదృష్టకరం. దళిత గిరిజన వెనక బడిన కులాల రైతులపై ఉన్న కపట ప్రేమకు అద్దం పడుతుంది.
రాష్ట్రంలో ప్రభుత్వం అభివృద్ధి పేరుతో.. కొందరు రాజకీయ నాయకులు అధికార బలంతో ఈ అసైన్డ్ భూములను పేద రైతుల వద్దనుండి బలవంతంగా లాక్కోవడం జరుగుతుంది. కర్ణాటక రాష్ట్రంలో అసైన్డ్ చేసిన 15 ఏళ్లకు.. తమిళనాడు రాష్ట్రంలో అసైన్డ్ చేసిన 20 ఏళ్లకు శాశ్వత హక్కులు కలిపిస్తున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా రైతులకు చేసిన అసైన్డ్ భూములకు శాశ్వత హక్కులు కలిపిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచన చేసి.. అసైన్డ్ భూములు ఉన్న రైతులకు శాశ్వత హక్కులు కల్పిస్తూ.. ఉత్తర్వులు ఇస్తే వారికి అమ్ముకునే హక్కు కలిగి ఉంటుంది. దీంతో వారికి ఆర్థిక భరోసా కలుగుతుంది. పిల్లల చదువులకు,పెంళ్లిళ్లకు అమ్ముకుంటారు. వెంటెనే చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. దీనిని అమలు చేసేంత వరకు రైతులతో కలిసి బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు, దళిత,గిరిజన సంఘాలు ఉద్యమించాల్సిన అవసరం ఉంది.