ప్రపంచాన్నివణికిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టేందుకు వివిధ దేశాలు నివారణ చర్యలు చేపట్టాయి. అందులో భాగంగానే భారత ప్రభుత్వం టీకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఇప్పుడు భారత్ లో అభివృద్ది చేసిన వ్యాక్సిన్ల వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. కరోనా సోకిన వ్యక్తి ఇమ్యూనిటీ కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలతో మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
అయితే.. ఇప్పుడవి బహిరంగ మార్కెట్లోకి రానున్నాయి. వీటిని బహిరంగంగా విక్రయించేందుకు..షరతులతో కూడిన అనుమతులు జారీ చేసింది భారత ఔషధ నియంత్రణ సంస్థ. డీసీజీఐ నుంచి సాధారణ అనుమతి పొందిన క్రమంలో టీకాల ధరలను నిర్ణయించనున్నాయి ఆయా ఫార్మా సంస్థలు.
సాధారణంగా టీకా ధర బహిరంగ మార్కెట్లో రూ.275గా నిర్ణయించే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి.అయితే..దీనికి రూ.150 సేవా రుసుము అదనమని తెలిపాయి.ప్రస్తుతం ప్రైవేట్ లో కొవాగ్జిన్ ఒక డోసు ధర సేవా రుసుంతో కలిపి రూ.1200 కాగా.. కొవిషీల్డ్ ధర రూ.780గా ఉంది.
గతేడాది జనవరి 3న అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు ఈ రెండు టీకాలు అనుమతి పొందాయి. అయితే..కొన్ని షరతులకు లోబడి ఈ రెండు టీకాలను వయోజనులకు ఇచ్చేందుకు సాధారణ అనుమతి ఇవ్వాలని నిపుణుల కమిటీ ఈనెల 9న ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు ఆ రెండు సంస్థలు సాధారణ అనుమతి కోసం అవసరమైన సమాచారం సమర్పించాయి.