యముడితో పోరాడి భర్త ప్రాణాలు తిరిగి తెచ్చుకున్న సతీ సావిత్రి కథ తెలుసు కదా.. అవకాశం ఉంటే ఈ రోజుల్లో కూడా భర్త కోసం అంతటి సాహసం చేసే భార్యలూ లేకపోలేదు. అయితే ఎప్పుడూ భార్యలే త్యాగాలు చేయాలా?.. భర్తలకు అంతటి ప్రేమలుండవా అంటే… ముమ్మాటికి ఉంటుందనే దానికి ఉదాహరణంగా నిలిచారు కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి.
కర్ణాటకలోని కొప్పళ పట్టణానికి చెందిన నాగమాధవి, శ్రీనివాస్ గుప్తా భార్యభర్తలు. ఒకరంటే ఒకరికి ప్రాణం. పెద్ద ఇల్లు కట్టుకోవాలని.. పిల్లా పాపలతో అందులో సంతోషంగా జీవించాలని కలలు కన్నారు. కాని కాలం వారి కలలని చిదిమేసింది. ఓసారి తిరుమల దర్శనానికి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో.. నాగమాధవి చనిపోయింది. శ్రీనివాస్ ఒంటరివాడైపోయాడు. పిల్లల కోసం ఆమె లేని బాధను దిగమింగుకొని.. కాల క్రమంలో మంచి ఇల్లు కట్టాడు. కానీ ఆ సంతోషాన్ని పంచుకునేందుకు పక్కన భార్య లేకపోవడం శ్రీనివాస్‌ను ఎంతో బాధించింది. అందుకే ఆమె లేని లోటును ఎలాగైనా తీర్చుకోవాలని అనుకున్నాడు.
బెంగళూరుకు చెందిన కళాకారులను కలిసి… తన భార్య ప్రతిరూపాన్ని పొలి ఉండే విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వాలని కోరాడు. ఆయన కోరిక మేరకు అచ్చ ప్రాణమున్నట్టే పోలిన నాగమాధవి విగ్రహాన్ని వారు తయారు చేసి ఇచ్చారు.జీవకళ ఉట్టిపడుతున్న ఆ బొమ్మను ఇల్లాలి హోదాలో కూర్చోబెట్టి.. శ్రీనివాస్ అంగరంగ వైభవంగా గృహప్రవేశం చేసుకున్నాడు. ఆ వేడుకకు వెళ్లిన బంధువులు తీసిన ఫోటోలు, వీడియోలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ మారాయి.