డబుల్ బెడ్ రూమ్ ఇంటి కోసం ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నం చేశాడు. తనకు డబుల్ బెడ్ రూమ్ కేటాయించలేదని, తనకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. బాధితుని వివరాల ప్రకారం….
చొప్పదండి మండల కేంద్రంలో గత 50 ఏండ్లుగా చిద్యా సురేశ్ నివాసం ఉంటున్నాడు. అతను చొప్పదండి నివాసి అనే ధ్రువీకరించే రేషన్, ఆధార్ కార్డులు కూడా అతని వద్ద ఉన్నాయి. అయితే అధికారులు తాను స్థానికేతరుడిన పేర్కొంటు తన భార్య పేరును జాబితా నుంచి తొలగించారు.
మేదరి కులానికి చెందిన ఆయనకు సొంత ఇల్లు లేకపోవడం, డబుల్ బెడ్ రూం అర్హుల జాబితా నుంచి పేరు లేకపోవడంతో మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో చొప్పదండి ఎన్టీఅర్ విగ్రహం వద్ద ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఆ సమయంలో అదే ప్రాంతంలో బీజేపీ సమావేశం జరుగుతోంది. ఈ విషయాన్ని గమనించిన బీజేపీ నాయకులు సురేష్ ను వారించి అతని దగ్గర నుంచి అగ్గిపెట్టెని లాక్కున్నారు. అతన్ని సముదాయించడంతో ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.
డబుల్ బెడ్ రూం అర్హుల జాబితా ఇదేనంటూ ఇటీవల ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ జాబితా కారణంగానే సురేష్ ఆత్మహత్య యత్నం చేసినట్టు తెలుస్తోంది. చొప్పదండి ప్రాంత వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అవుతున్న జాబితాలో సురేష్ పేరు లేకపోవడంతో వేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు చెప్తున్నారు.