హైప్రోఫైల్ వ్యక్తులను దోచుకునేందుకు కొందరు కేటుగాళ్లకు భలే ఐడియాలు వస్తుంటాయి. ఎంతటివారినైనా ఏ మాత్రం జంకు లేకుండా ఈజీగా బోల్తాకొట్టిస్తారు. మంత్రి, ఎమ్మెల్యేల పీఏలం అంటూ, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అప్పుడప్పుడూ మోసాలకు పాల్పడేవాళ్లు చూసి ఉంటాం.. కానీ తాజాగా ఓ ఫేక్‌ఫెలో డబ్బుల కోసం మాస్టర్ ప్లానే వేశాడు. మంత్రి కేటీఆర్ పీఏనని డబ్బు వసూళ్లు చేయబోయి అడ్డంగా బుక్కయ్యాడు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన బుడుమూరు నాగరాజు.. మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్. కొంతకాలంగా జల్సాలకు అలవాటుపడి ఈజీ మనీ కోసం మోసాలకు దిగాడు. ఈ క్రమంలోనే తనను కేటీఆర్‌గా పరిచయం చేసుకుని.. ఈ నెల 15వ తేదీన బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్ హాస్పిటల్ ల్యాండ్‌లైన్‌కు కాల్ చేశాడు.ఎండీ డాక్టర్ కంచర్ల రమేశ్ ఫోన్ నంబర్ అడిగి తెలుసుకొని.. ఆ తర్వాత ఆయనకు ఫోన్ చేశాడు. తాను కేటీఆర్ పీఏ తిరుపతిరెడ్డిని అని.. ఈ నెల 25న ఎల్బీ స్టేడియంలో కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పుకొచ్చాడు. మీడియా ప్రకటన కోసం 50 లక్షలు ఇవ్వాలని కోరాడు.
తొలుత నాగరాజు మాటలు నిజమేనని రమేష్ నమ్మాడు. అయితే డబ్బల వ్యవహారం కావడంతో.. తిరుపతి రెడ్డి గురించి ఆరా తీశాడు. దీంతో నాగరాజు బండారం బట్టబయలైంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.