హైదరాబాద్ నగరంలో కార్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. శుక్రవారం రంగారెడ్డిలోని చేవెళ్ల ఘటన మరువక ముందే అలాంటి మరో ఘటన నగరంలో చోటు చేసుకుంది. కారుతో ఓ వ్యక్తిని గుద్దితే.. అతను పల్టీలు కొట్టుకుంటూ.. ఏకంగా 20 మీటర్ల దూరంలో పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని నాగోల్ లో జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నాగోల్ ఉన్నత పాఠశాల వద్ద వేగంగా వచ్చిన కారు.. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. కుషాయిగూడ నగరానికి చెందిన వ్యక్తి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతను రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ సెల్ ఫోన్ వైపు చూసుకుంటూ నాగోల్ వైపు వెళ్తున్నాడు.
ఇంతలో ఓ కారు వచ్చి అతన్ని బలంగా ఢీ కొట్టింది. అంతే గాల్లోకి ఎగిరి 20 మీటర్ల దూరం పల్టీలు కొట్టుకుంటూ కిందపడ్డాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ కి ఫోన్ చేశారు. ప్రస్తుతం గాయపడిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని గాంధీ ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ వ్యక్తిని ఢీ కొట్టడానికి ముందే.. మరో మహిళను కూడా కారు ఢీకొట్టిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంపై ఎటువంటి ఫిర్యాదు గానీ, సమాచారం గానీ తమకు అందలేదని పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.