చాలా మందికి చిన్న కుక్కపిల్లను పెంచుకోవాలని ఆశ ఉంటుంది. అలాగే ఓ కుటుంబం ఆర్నెళ్ల క్రితం ఓ చిన్న కుక్కపిల్లను కొని తెచ్చుకోని పెంచుకుంటున్నారు. చిన్నతనంలో అది చాలా బొచ్చుతో ఎంతో ముద్దుగా ఉంది. కానీ రానురాను అది కుక్కలా కాకుండా నక్కలా అనిపించింది. అసలు విషయం తెలుసుకొని దానిని అధికారులకు అప్పగించే లోపల అది పారిపోయింది.
దక్షిణ అమెరికాకు చెందిన పెరూ దేశంలో ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పెరూ రాజధాని లిమాలోని ఓ చిన్న దుకాణం నుంచి స్థానిక ఫ్యామిలీ ఒకటి 13 డాలర్లు
వెచ్చించి ఓ పప్పీని కొని ఇంటికి తీసుకొచ్చుకుంది. అది ఒంటినిండా జూలుతో చాలా బుజ్జిగా, అందంగా ఉంది. దీనికి తోడు.. చలాకీగా, అందంగా పరుగెత్తుతుండటంతో దానికి ముద్దుగా ‘రన్ రన్’ అని పేరు పెట్టుకుంది ఆ కుటుంబం.
మామూలు శునకాల కంటే కాస్త భిన్నంగా ఉండటంతో ఇరుగుపొరుగు వారికి కూడా అది బాగా నచ్చింది. కొద్ది రోజులకు ఆ కుక్క మూడు గినియా పందుల (పందుల లాంటి చిన్న జంతువు)ను చంపిందని మరొకరు ఆ కుటుంబంపై ఫిర్యాదు చేశారు. దానికి మాంసాహారం పిచ్చి అంతలా ఎందుకు పట్టుకుందా అని ఆ కుటుంబం తలపట్టుకుంది. ఇరుగుపొరుగు వారికి పరిహారం కూడా భారీగానే చెల్లించాల్సి వచ్చింది.‘రన్ రన్’ అలా పెరుగుతున్నకొద్దీ అనుమానాలు కూడా పెరిగాయి.
రాను రాను దాని పోలికలు చూస్తే.. నక్కలా, తోడేలులా అనిపించింది. ఇంతలో ఓ రాత్రి వారి అనుమానమే నిజమైంది. అర్ధరాత్రి అది నక్కలా అరిచింది. అమ్మ బాబోయ్.. అని తేరుకొని, దాన్ని ఫారెస్ట్ అధికారులకు అప్పగించాలని ఆ కుటుంబం అదే రాత్రి నిర్ణయానికి వచ్చింది. కానీ, తెల్లారి లేచి చూసే సరికి అది తప్పించుకొని ఎక్కడికో పారిపోయింది.
మొత్తానికి పెరూ అటవీ శాఖ అధికారులు ఆ పారిపోయిన నక్కను పట్టుకొని బంధించారు. దానికి వైద్య పరీక్షలు నిర్వహించి జూకు తరలించారు. కొంత మంది వేటగాళ్లు అమెజాన్ అడవుల్లో అడవి జంతువులను బంధించి, లిమా నగర శివార్లకు అక్రమంగా తరలిస్తారని.. అక్కడి షాపుల్లో వాటిని అమ్ముతారని అధికారులు తెలిపారు.