పాకిస్తాన్ మాజీ మిలిటరీ రూలర్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ తన 79 వ ఏట దుబాయ్ లోని ఆసుపత్రిలో కన్ను మూశాడు. పాక్ అధ్యక్షునిగా ఉక్కు పిడికిలితో తొమ్మిదేళ్ల పాలన సాగించి ఓ నియంతగా కూడా పేరు తెచ్చుకున్నాడు. 1999 లో నాడు పాక్ లో రక్తపాతం లేకుండా జరిగిన సైనిక కుట్రలో ప్రభుత్వ గద్దెనెక్కాడు. సైన్యాధ్యక్షునిగా కూడా తన దేశ ఆర్మీకి నేతృత్వం వహించాడు. ఇండియాతో పేచీ పడుతూ ఆ నాడు కార్గిల్ యుద్దానికి కారకుడయ్యాడు. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేసేందుకు నానా విధాలా యత్నించి.. ఈ విషయంలో మెత్తగా వ్యవహరిస్తున్నారంటూ నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని పడగొట్టాడు.
1999 మే నుంచి జులై వరకు భారత-పాకిస్థాన్ మధ్య దళాల మధ్య జరిగిన కార్గిల్ వార్ నేటికీ ఉభయదేశాల మధ్య ఉద్రిక్తతలకు తావిస్తూనే ఉంది. . మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో, లాల్ మసీదు మత పెద్ద అబ్దుల్ రషీద్ ఘాజీల హత్య కేసులో ముషారఫ్ పై ఆరోపణలు రావడం, 2007 లో రాజ్యాంగాన్ని తాత్కాలికంగా రద్దు చేసినందుకు ఆయనపై దేశద్రోహం అభియోగాన్ని కూడా మోపడం తెలిసిందే. దీంతో 2008 లో ఆయన లండన్ పారిపోయాడు. అనంతరం 2013 లో పాక్ కు తిరిగి వచ్చి సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధం కాగా అనర్హత వేటు పడింది. కోర్టు ఆదేశాలతో ఆయనను అరెస్టు చేసినప్పటికీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బాటు వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. 2019 లో ముషారఫ్ కు ఇస్లామాబాద్ కోర్టు మరణ శిక్ష విధించినా.. లాహోర్ హైకోర్టు దాన్ని తగ్గించింది.
ఒకనాడు తనకు సైన్యాధిపతి పదవి రావడానికి కారకుడైన నవాజ్ షరీఫ్ చాప కిందికే ముషారఫ్ నీళ్లు తెచ్చాడు. ఈయనకు ఫోర్ స్టార్ జనరల్ గా పదోన్నతి కల్పించి.. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ గా చేసినప్పటికీ.. కార్గిల్ యుధంవిషయంలో నవాజ్ షరీఫ్ తో విభేదించాడు. ముషారఫ్ ను పదవి నుంచి తొలగించి ఆ బాధ్యతలను ఖ్వాజా జియాయుద్దీన్ కు అప్పగించాలని షరీఫ్ నిర్ణయించగానే.. ఆగ్రహించిన ముషారఫ్ 1999 లో సైనిక తిరుగుబాటు చేసి షరీఫ్ ని పదవీచ్యుతుడిని చేశారు
. 2001 లో ముషారఫ్ తనను తానే అధ్యక్షునిగా ప్రకటించుకున్నాడు. 2007 లో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి మళ్ళీ అధికార పగ్గాలు చేబట్టాడు. అయితే ఆ ఎన్నికను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసులో తనకు వ్యతిరేకంగా తీర్పు రానుందని పసిగట్టిన ముషారఫ్.. దేశంలో ఎమర్జన్సీ విధించాడు. ఎలాగైనా పదవిలో కొనసాగాలన్న ఆయన అభిమతాన్ని రెండు ప్రధాన పార్టీలు వ్యతిరేకించాయి. దాంతో ముషారఫ్ రాజీనామా చేయకతప్పలేదు. ఆ తరువాత ఏర్పడిన ప్రభుత్వం ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేసింది.