కష్టం వస్తే.. అండగా ఉండాల్సిన ఇంటిపెద్ద నిసహాయస్థితిలో ఉంటే, పెద్ద సమస్యలో మునిగిపోతే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? అలాంటిది ఈ ప్రపంచానికే ఓ ఔషదంగా మారిన వేప కనుమరుగయ్యే పరిస్థితి వస్తే ఏమవుతోంది? వేపను సర్వరోగ నివారిణిగా చెప్పుకుంటాం. కానీ.. ఆవేపే ఇప్పుడు రోగాల బారినపడుతోంది. రెండేళ్లుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వేపకు తెగుళ్లు సోకి నిలువుగా ఎండిపోతున్నాయి. దీనిపై మైసూర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల పరిశోధనలు చేసి దీనికి కారణాలు, దీని పర్యావసానాలు గుర్తించారు.
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాదూన్ అడవుల్లో ప్రారంభమైన తెగుళ్లు కొద్దిరోజుల్లోనే దేశమంతా విస్తరించాయి. దీన్ని మైసూర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల గుర్తించి పరిశోధనలు చేశారు. దేశవ్యాప్తంగా ఆరునెలలుగా వేపచెట్లకు ‘పోమోప్సిస్’ శిలీంధ్రంతో పాటు టి మస్కిటో బగ్ అనే పురుగులు సోకి ఆకులు, పూలు, కొమ్మలు ఎర్రబారి ఎండిపోయి పూర్తిగా రాలిపోతున్నాయని పరిశోధనలు చేపట్టారు.
ముందుగా ఈ శిలీంధ్రాలు సోకడం వలన వేపచెట్టు ఎండిపోతుంది. తరువాత దీనిలో రోగనిరోధకశక్తి తగ్గడం వలన మరో 16 రకాల శిలీంధ్రాలు, పురుగులు ఎటాక్ చేసిన పూర్తిగా నాశనం చేస్తున్నాయని పరిశోధనల్లో తేలింది. ఈ తెగుళ్లకు ప్రధాన కారణం రెండేళ్లుగా కురుస్తున్న అధిక వర్షాలు అని తేల్చారు. వేపను నాశనం చేస్తున్న ఈ శిలీంధ్రం హిమాలయ ప్రాంత అడవుల నుంచి పుట్టుకొచ్చిందని పరిశోధకులు చెబుతున్నారు.
దీని వలన వైద్యరంగంపై తీవ్రమైన ఒత్తిడి పడుతోందని అంటున్నారు. భూమ్మీద 2400 రకాల ఔషధగుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయి. వీటన్నింటిలో వేపచెట్టుకే అగ్రతాంబూలమని నిపుణులు అంటున్నారు. సుమారు 200 రకాల పురుగులను చంపే శక్తి వేప ఉత్పత్తులకు ఉంది. అందుకే ఇప్పుడు వేప కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందంటే వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ లో ప్రస్తుతం 2 కోట్ల వేపచెట్లు ఉన్నాయని ఒక అంచనా.
మన ఔషధ అవసరాలు తీరాలంటే మరో 3 కోట్ల చెట్లు పెంచాలి. వందకిలోల వేపగింజలను నుంచి 40 కిలోల వేపనూనె తయారు అవుతోంది. క్వింటా వేపగింజలను రూ.1500 చొప్పున ఎరువుల కంపెనీలు కొంటున్నాయి. వేపచెట్టు పూలు, పండ్లు, గింజల నుంచి నూనె తీసిన తరవాత మిగిలిన వ్యర్థం కూడా ఏదో ఒక ఔషధగుణం కలిగి ఉంటుంది. కుష్టు వ్యాధి, ఎముకలు, కీళ్ల జబ్బులు, అల్సర్లు, చర్మవ్యాధులకు వేపనూనెను వాడుతారు.
అయితే.. ఈ తెగుళ్లు నుంచి వేప చెట్టుని రక్షించాలంటే పరిశోధకులు కొన్ని చిట్కాలు చెప్పారు. చెట్టు ఎండి పోతున్నట్టు గుర్తిస్తే.. లీటరు నీటిలో 2 మిల్లీలీటర్ల ‘ప్రొఫెనోప్‌స్’ అనే రసాయనాన్ని కలిపి చల్లాలని అన్నారు. కార్బండిజం, మ్యాంకోజెబ్ అనే రసాయన మిశ్రమాన్ని లీటరు నీటిలో 2.5 గ్రాముల చొప్పున కలిపి వేపచెట్టుపైన, బెరడు, మొదలుపై చల్లాలని సూచించారు. అయితే.. ఈ మందులు వాడినపుడు చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. మనం తాగే నీటిలో ఈ మందు కలిస్తే.. చాలా ప్రమాదం అని అన్నారు. ఈ రసాయనాలు కలిసిన నీటిని తాగితే.. మనుషులు కానీ.. జంతువులు కానీ చనిపోయే ప్రమాదం ఉందని పరిశోధకలు చెప్పారు.