డాగ్ లవర్స్ కి బ్యాడ్ న్యూస్ చెప్పింది మధ్యప్రదేశ్ సాగర్ మున్సిపల్ కార్పొరేషన్. కుక్కను పెంచితే పన్నుకట్టాలని శునక ప్రియులకు షాకిచ్చింది. సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పెంపుడు కుక్కల వివరాలను నమోదు చేసి వాటికి టీకాలు వేయించడంతోపాటు పెంపుడు జంతువుల యజమానుల నుంచి భద్రత, పరిశుభ్రత పన్ను వసూలు చేయాలని పెట్ లవర్స్ పై పెనుభారం మోపింది.
పెంపుడు కుక్కల యజమానుల నుంచి పన్ను వసూలు చేయాలనే తీర్మానాన్ని 40 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. సాగర్ మునిసిపల్ కార్పొరేషన్ ఈ చట్టాన్ని రూపొందించిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. సాగర్ నగర వీధుల్లో కుక్కల బెడద పెరుగుతుండడంతో కుక్కల యజమానులపై పన్ను విధించాలని మున్సిపాలిటీ నిర్ణయం తీసుకుంది.
వీధికుక్కల బెడద మాత్రమే కాకుండా పెంపుడు కుక్కల ద్వారా బహిరంగ ప్రదేశాలు మురుగుగా మారుతున్నాయి. వీధికుక్కలు, కుక్కలను పెంచే వారి వల్ల నగరమంతా చెత్తా చెదారం నిండుతుందని సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ బృందావన్ అహిర్వార్ చెప్పారు. కుక్కలు మనుషులను కరిచిన ఘటనలు అనేకం ఉన్నాయని కౌన్సిలర్లు సమావేశంలో ప్రస్తావించారు.