గోదావరిలో బోటు ప్రమాదం వివాదం ఇప్పుడు సుప్రీం కోర్టు గుమ్మం తొక్కింది. బోటును వెలికితీయడం అధికారులకు ఇష్టం లేదని, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇందులో వాటాలు వున్నాయని సంచలన ఆరోపణలు చేసిన మాజీ ఎంపీ హర్షకుమార్ దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
రాజమహేంద్రవరం: ప్రమాదం జరిగిన బోటుతో పాటు అంతుచిక్కని మృతదేహాలనూ వెలికితీసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని పార్లమెంట్ మాజీ సభ్యుడు హర్షకుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని, బోటు వెలికితీతపై నిర్లక్ష్యం చేస్తున్నారని హర్షకుమార్ పిటిషన్‌లో పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించినట్టు సమాచారం.
కొద్దిరోజుల క్రితం హర్షకుమార్ బోటు ప్రమాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టూరిజం బోట్లలో మంత్రులు, ఎమ్మెల్యేలకు వాటాలున్నాయని ఆరోపించారు. ప్రమాదం ముందు పోలీసులు తీసిన ఫొటోలు, సెల్‌ఫోన్ సంభాషణలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బోటును వెలికితీయడం అధికారులకు ఇష్టం లేదని ఆయన ప్రధానంగా చేస్తున్న అభియోగం. ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి గల్లంతైనప్పుడు పడ్డ బాధేంటో ముఖ్యమంత్రి జగన్‌కు తెలుసు. ఇప్పుడు బోటు ప్రమాద బాధితుల బాధను సీయం కూడా అర్థం చేసుకోవాలి. పుష్కరాల్లో 28మంది చనిపోతే అధికారులను ఎందుకు సస్పెండ్ చేయలేదని అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని జగన్ డిమాండ్ చేశారు. ఇప్పుడు బోటు ఘటనపై జగన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’’ అని హర్షకుమార్ సూటిగా ప్రశ్నించారు.
దీనిపై ప్రభుత్వం కూడా తీవ్రంగానే స్పందించింది. మరోవైపు బోటు ప్రమాద మృతుల సంఖ్యను ఎక్కువ చేసి చెప్పి ప్రజానీకాన్ని తప్పుదారి పట్టించారని హర్షకుమార్‌పై కేసు నమోదు అయింది. హర్షకుమార్ అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. తర్వాత హర్షకుమార్ కనిపించలేదు. హర్షకుమార్ తప్పించుకోవడానికి సహకరించారనే కారణంతో రాజమండ్రి త్రీటౌన్ సీఐ శేఖర్‌బాబును పోలీస్ అధికారులు సస్పెండ్ చేశారని వార్తలొచ్చాయి.