గుంటూరు జిల్లా రేపల్లె మండలం ఉప్పూడి గ్రామ సర్పంచ్ విజయ బేబీ ఎన్నికపై వివాదం కొనసాగుతోంది. ఆమె ఎన్నిక చెల్లదంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అదే గ్రామానికి చెందిన తెనాలి కాంతి సుమన్ బాబు అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశాడు.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా విజయ బీబీకి ముగ్గురు పిల్లలు ఉన్నారని అభ్యంతరం తెలిపినా… అధికారి పట్టించుకోలేదని సుమన్ బాబు పిటిషన్ లో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సర్పంచ్ తో పాటు.. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రేపల్లె ఎంపీడీవో, తెనాలి ఆర్డీవో, గుంటూరు జిల్లా కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. వీరంతా ఈనెల 17న వ్యక్తిగతంగా గానీ.. వారి తరుఫున న్యాయవాదితో గానీ.. హాజరుకావాల్సి ఉంటుందని పిటిషనర్ తరుఫు న్యాయవాది పూర్ణచంద్రరావు తెలిపారు.
సర్పంచ్ గా గెలిచిన విజయ బేబీ ఎన్నిక చెల్లదని కాంతి సుమన్ బాబు అంటున్నాడు. నిబంధనల ప్రకారం ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని తెలిసినా… కావాలనే ఉల్లంఘించారని ఆరోపించాడు. పైగా కడుపున పుట్టిన బిడ్డను తన సంతానం కాదని చెబుతున్న సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. ముగ్గురు సంతానం ఉన్న సర్పంచ్ లు అనర్హత వేటుకు గురైన సందర్భాలు చాలానే ఉన్నాయని… విజయ బేబీని డిస్ క్వాలిఫై చేసే వరకు పోరాడతానని చెప్పాడు సుమన్ బాబు.